ఆర్‌ఆర్‌ఆర్‌లో పెట్టుబడులకు తొందరొద్దు

1 May, 2021 05:01 IST|Sakshi

మన వెంచర్‌ పక్క నుంచే ఆర్‌ఆర్‌ఆర్‌ వెళుతుంది సార్‌. అటు పక్కన మనది వంద ఎకరాల్లో టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ వస్తుంది! ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు మొదలైతే రేట్లు డబుల్‌ అవుతాయి మేడం. ఇప్పుడు కొంటేనే మంచి లాభం పొందొచ్చు!! రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) ఏజెంట్లు, డెవలపర్లకు విక్రయాల మంత్రదండంలా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో రాత్రికి రాత్రే ధరలను రెండింతలు చేసేశారు. లేఅవుట్‌ ప్లాన్, అనుమతులు, అభివృద్ధి పనులు ఇవేవీ ఉండవు.. జస్ట్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ పేరిట మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ప్లాట్లను విక్రయించేసి చేతులు దులుపుకుంటున్నారు డెవలపర్లు.

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా ఈ రింగ్‌ రోడ్డు వెళుతుండటంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 35–40 శాతం వరకు పెరిగాయి. శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కంటే ఎక్కువే ధరలు పెరిగాయని స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. హైవే ఫేసింగ్‌ ఉన్న భూముల ధర ఎకరానికి రూ.2 కోట్లు, కాస్త లోపలికి ఉంటే రూ.1–1.5 కోట్ల వరకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తుందని భావిస్తున్న భూముల్లో వ్యవసాయం దాదాపు నిలిచిపోయింది. ఏ జిల్లాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ వెళుతుందో క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్దమయ్యాకనే అధికారికంగా ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ప్రభుత్వ ప్రకటనలతో రేట్లు జూమ్‌..
ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ శా>టిలైట్‌ టౌన్‌షిప్పులు, లాజిస్టిక్‌ పార్క్‌లు ఏర్పాటవుతాయంటే కాసింత అనుమానమే. ఎందుకంటే ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఆరంభంలో ఇలాగే ఆనాటి ప్రభుత్వం శాటిలైట్‌ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ దాదాపు పదహారేళ్లు దాటినా వాటి ఊసేలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారి టౌన్‌షిప్పుల జీవోలను మార్చుతూ వచ్చాయే తప్ప.. ఇవి ఏర్పాటయ్యేందుకు ఎదురయ్యే వాస్తవిక సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు రాలేదు.

ఓఆర్‌ఆర్‌ శాటిలైట్‌ టౌన్‌షిప్పుల పరిస్థితి ఇలాగుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ డెవలప్‌ అయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించుకోవాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ పారిశ్రామిక వాడలు, ఐటీ సెంటర్లు, లాజిస్టిక్‌ పార్క్‌లు, ఫార్మా పరిశ్రమలు, రిక్రియేషన్‌ సదుపాయాలు, వాణిజ్య కట్టడాలు, షాపింగ్‌ మాల్స్, మల్టిప్లెక్స్‌లు వంటివి వాస్తవం కావటానికి ఇంకెంత కాలం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వ ప్రకటనల పుణ్యమా అంటూ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ధరల్ని కృత్రిమంగా పెంచేస్తున్నారు. దీంతో భూసేకరణ జరపడం కష్టంగా మారుతుంది.  

ఓఆర్‌ఆర్‌ను చూసే నిర్ణయం..  
ఒకసారి ఔటర్‌ రింగ్‌ రోడ్డునే క్షుణ్నంగా పరిశీలిస్తే.. గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకు సర్వీస్‌ రోడ్‌కి ఇరువైపులా కొన్ని హైరైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. మరోవైపు కొల్లూరు దాకా కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక కొల్లూరులో సర్వీస్‌ రోడ్డు లేనే లేదు. అక్కడ ఓఆర్‌ఆర్‌ నుంచి సర్వీస్‌ రోడ్‌కు వెళ్లాలంటే మట్టి రోడ్డు మీద ప్రయాణించాల్సిన దుస్థితి. 156 కి.మీ. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)కు ఇరువైపులా కి.మీ చొప్పు న గ్రోత్‌ కారిడార్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అంటే 316 కి.మీ. మేర అభివృద్ధి పనులు, ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క పశ్చిమ హైదరాబాద్‌ తప్ప మిగిలిన ప్రాంతాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆదిభట్ల వద్ద టీసీఎస్, కాగ్నిజెంట్‌ వల్ల కొంత కదలికలు వచ్చినప్పటికీ.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోచారం వద్ద ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలు ఏర్పడడంతో ఇక్కడ కొంత ఊపొచ్చింది.  పటాన్‌చెరు వద్ద ప్లాస్టిక్‌ పరిశ్రమలు, బాటసింగారం వద్ద లాజిస్టిక్‌ పార్క్‌లు, బుద్వేల్‌లో ఐటీ పార్క్‌ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా చూస్తే రాత్రికి రాత్రే ఆయా ప్రాం తాలలో భూముల ధరలు పెరిగాయే తప్ప ప్రకటించిన అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చలేదు.

మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే..
గతంలో ప్రయాణ దూరాన్ని కి.మీ. చొప్పున చెప్పేవాళ్లం. కానీ, ఇప్పుడు సమయంలో చెబుతున్నాం. ఎందుకంటే ఓఆర్‌ఆర్, మెట్రోలతో ప్రయాణం సులువైంది కాబట్టి.. ప్రధాన నగరం నుంచి ఎన్ని కి.మీ. దూరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుందనేది మ్యాటర్‌ కాదు. పట్టణీకరణ, వ్యాపార, ఉద్యోగ అవకాశాలతో నగరం శరవేగంగా అభివద్ధి చెందుతుంది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా సిటీ విస్తరణ జరగాల్సిందే. కాకపోతే ఆయా ప్రాంతాలలో ముందుగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే గ్రోత్‌ కారిడార్లలో కంపెనీలు, ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. ఫలానా ప్రాంతం మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ రహదారి వెళుతుందంటూ ఏజెంట్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దు. విచక్షణతో కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.  
  
 – జే వెంకట్‌ రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ.
    (ఏవీ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ) 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు