చైనా కార్లా?.. టెస్లాకు భారత్‌ డెడ్లీవార్నింగ్‌

8 Oct, 2021 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కొద్ది నెలల నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని అమెరికాకు చెందిన టెస్లాను అనేకసార్లు కోరినట్లు, అదే సమయంలో సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 'ఇండియా టుడే కాన్ క్లేవ్ 2021'ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు టెస్లా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల కంటే తక్కువ ఏమి కాదని అన్నారు.

చైనా ఎలక్ట్రిక్ కార్లు విక్రయించొద్దు.. 
"చైనాలో తయారు చేసిన మీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి. ఇంకా అవసరం అయితే టెస్లా కార్లను ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. పన్ను రాయితీల విషయంలో సంస్థ డిమాండ్ చేసిన వాటి గురుంచి టెస్లా అధికారులతో తాను ఇంకా చర్చలు జరుపుతున్నానని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. గత నెలలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాను మొదట భారతదేశంలో తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరిన విషయం మనకు తెలిసిందే. (చదవండి: టెస్లా ఎలన్‌ మస్క్‌.. బెంజ్‌ని చూసి నేర్చుకో..!)

ఇప్పటికే జర్మనికి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేసింది. గతేడాది ఆ సంస్థ రిలీజ్‌ చేసిన ఎస్‌ సిరీస్‌ కార్లు ఇండియాలో బాగానే క్లిక్‌ అయ్యాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు పూనేలో కార్ల తయారీ యూనిట్‌ని రూ. 2,200 కోట్ల వ్యయంతో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఏర్పాటు చేసింది. ఇండియాలో​ కార్ల తయారీ యూనిట్‌ నెలకొల్పి కార్ల ఉత్పత్తి ప్రారంభించడంతో కేంద్రం విధించే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఒక్కసారిగా బెంజ్‌ కార్ల ధరలు తగ్గిపోయాయి. మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ 450 4 మ్యాటిక్‌ ధర రూ. 2.19 కోట్ల నుంచి రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, టెస్లా గనుక ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్ నిర్మిస్తే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు తెలుపుతున్నారు.

>
మరిన్ని వార్తలు