Pakistan Gold Price: వామ్మో! తులం బంగారానికి రూ.2 లక్షలా? ఎందుకంత ధర..?

4 Mar, 2023 12:08 IST|Sakshi

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. డీజిల్, పెట్రోల్ మాత్రమే కాకుండా పాలు, మాంసం ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

తాజాగా పాకిస్థాన్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం వెల్లడైంది. పది గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2.06 లక్షలకు చేరింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ భారీగా పతనం కావడంతో ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 300 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ కీ రేటు ప్రస్తుతం 20 శాతంగా ఉంది. 1996 అక్టోబర్ నుంచి చూసుకుంటే ఇదే అత్యధికం. గత జనవరిలోనే 100 బేయిస్ పాయింట్లు పెంచి 17 శాతానికి చేసిన సెంట్రల్ బ్యాంక్ కేవలం నెల రోజుల్లోనే మరో 300 బేసిస్ పాయింట్లను పెంచింది.

(ఇదీ చదవండి: తక్కువ ధరలోనే ఐటెల్ 4జి ట్యాబ్ వచ్చేసింది.. వివరాలు)

ఆర్థికం సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో సరిపడా నిల్వలు లేకుండా ఉండటమే కాకుండా, అవసరమైన ముడి సరుకులను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థిలో ఉంది. అప్పు కోసం తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పు ఇవ్వడానికి అంగీకరించింది. పన్ను వసూళ్లను పెంచుకోవడానికి ఇటీవలే మినీ బడ్జెట్‌ను సైతం ప్రవేశ పెట్టింది.

మరిన్ని వార్తలు