1.16 కోట్ల మంది విమాన ప్రయాణం

20 Dec, 2022 06:17 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకారం..  2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్‌ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు.

నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్‌ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్‌ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్‌ కంపెనీలైన ఎయిర్‌ ఇండియా, విస్తారా, ఎయిర్‌ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్‌ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి.  

మరిన్ని వార్తలు