ఎయిర్‌లైన్స్‌కు రూ. 17 వేల కోట్ల నష్టాలు

12 Nov, 2022 06:35 IST|Sakshi

ఈ ఆర్థిక సంవత్సరంపై అంచనాలు

సమీప భవిష్యత్తులో ఒత్తిడిలోనే పరిశ్రమ

ఇక్రా నివేదిక

ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్‌ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్‌లైన్స్‌ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్‌ పరిశ్రమకు ఇక్రా నెగటివ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చింది.

నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు..
► డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్‌లైన్స్‌ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా.

► మార్కెట్‌ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది.

► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్‌లైన్స్‌ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్‌లైన్స్‌ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఫ్లయిట్‌ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్‌ లీజింగ్‌కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు