మళ్లీ లాభాల్లోకి దేశీ ఎయిర్‌లైన్స్‌

4 Mar, 2023 04:13 IST|Sakshi

వచ్చే ఆర్థిక సంవత్సరంపై అంచనాలు

క్రిసిల్‌ నివేదిక

ముంబై: కోవిడ్‌ మహమ్మారి ధాటికి కుదేలైన దేశీ విమానయాన సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టనున్నాయి. వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, రుణభారాన్ని తగ్గించుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏవియేషన్‌ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ నష్టాల భారాన్ని 75–80 శాతం మేర రూ. 3,500–4,500 కోట్లకు తగ్గించుకోనున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 17,500 కోట్లుగా నమోదైంది. ప్యాసింజర్ల ట్రాఫిక్‌ గణనీయంగా మెరుగుపడటం, వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం వంటివి ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా విమానయానంలో 75 శాతం వాటా ఉన్న మూడు పెద్ద ఎయిర్‌లైన్స్‌పై విశ్లేషణ ఆధారంగా క్రిసిల్‌ ఈ అంచనాలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ .. కోవిడ్‌ పూర్వ స్థాయిని అధిగమించవచ్చని, చార్జీలు అప్పటితో పోలిస్తే 20–25 శాతం అధిక స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ షాహి తెలిపారు. విమాన ఇంధన ధరలు సగటున తగ్గడం కూడా దీనికి తోడైతే ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ పనితీరు మెరుగుపడి, అవి లాభాల్లోకి మళ్లగలవని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని కీలకాంశాలు..
► 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (కోవిడ్‌ పూర్వం) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ వరకూ 9 నెలల కాలంలో దేశీ, అంతర్జాతీయ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ వరుసగా 90 శాతం, 98 శాతానికి కోలుకుంది.  
► అంతర్జాతీయ సర్వీసులను కూడా పునరుద్ధరించడంతో బిజినెస్, విహార ప్రయాణాలు సైతం పెరిగాయి. ద్వితీయార్ధంలో పండుగల సీజన్‌ కూడా వేగవంతమైన రికవరీకి ఊతమిచ్చింది.
► అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నా భారత్‌ ఎదుర్కొని నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే తీరు కొనసాగవచ్చని అంచనాలున్నాయి.
► చార్జీలపై పరిమితులను తొలగించడమనేది విమానయాన సంస్థలు తమ వ్యయాల భారాన్ని ప్రయాణికులకు బదలాయించేందుకు ఉపయోగపడుతోంది.  
► ఏవియేషన్‌ రంగం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8,000–10,000 కోట్ల ఈక్విటీని సమకూర్చుకోనుంది. విమానాల సంఖ్యను పెంచుకునేందుకు, ప్రస్తుతమున్న వాటిని సరిచేసుకునేందుకు నిధులను వెచ్చించనుంది.  
► నిర్వహణ పనితీరు మెరుగుపడటం, ఈక్విటీ నిధులను సమకూర్చుకోవడం వంటి అంశాల కారణంగా స్వల్ప–మధ్యకాలికంగా విమానయాన సంస్థలు రుణాలపై ఆధారపడటం తగ్గనుంది.
► బడా ఎయిర్‌లైన్‌ను (ఎయిరిండియా) ప్రైవేటీకరించిన నేపథ్యంలో రుణ భారం తగ్గి, ఫలితంగా వడ్డీ వ్యయాలూ తగ్గి పరిశ్రమ లాభదాయకత మెరుగుపడనుంది.
► అయితే, సమయానికి ఈక్విటీని సమకూర్చుకోవడం, విమానాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలు, కొత్త వైరస్‌లేవైనా వచ్చి కోవిడ్‌–19 కేసులు మళ్లీ పెరగడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు