Domestic Airlines Fares: విమాన టికెట్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న చార్జీలు!

10 Aug, 2022 22:18 IST|Sakshi

విమాన టికెట్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి సమయంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్‌లను ఎత్తివేసింది. దీంతో ఇకపై దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై ఉన్న పరిమితులను తొలగించినట్లు దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇకపై ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు.

గతంలో దేశీయ మార్గాల్లో ఛార్జీల పై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ద్వారా తక్కువ చార్జీల వల్ల విమాన సంస్థలు, డిమాండ్‌ ఉన్న సమయాల్లో భారీ రేట్లతో ప్రయాణికులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం విమాయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

ఈ క్రమంలో విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్యాసింజర్లతో నింపేందుకు టిక్కెట్‌లపై డిస్కౌంట్‌లను అందించే అవకాశమే ఎక్కవగా ఉందంటూ నిపుణలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దేశీయంగా విమాన రంగం వృద్ధి సాధిస్తుందని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు. డిమాండ్, ఇంధన ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత ఛార్జీల పరిమితులను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు బంపరాఫర్‌.. ఆగస్టు 31 వరకు మాత్రమే!

మరిన్ని వార్తలు