విమాన చార్జీలకు రెక్కలు 

14 Aug, 2021 00:42 IST|Sakshi

దేశీ ప్రయాణ చార్జీల పరిమితులు 

13 శాతం దాకా పెంపు 

న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులను 9.83 శాతం – 12.82 శాతం మేర పెంచుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 40 నిమిషాల లోపు వ్యవధి ఉండే ఫ్లయిట్‌ల కనిష్ట చార్జీ పరిమితి రూ. 2,600 నుంచి రూ. 2,900కి (11.53 శాతం) పెంచింది. అలాగే గరిష్ట పరిమితిని 12.82 శాతం పెంచడంతో ఇది రూ. 8,800కి చేరింది. అలాగే 60–90 నిమిషాల వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి 12.5 శాతం పెరిగి రూ. 4,500కి, గరిష్ట చార్జీ 12.82 శాతం మేర పెరిగి రూ. 13,200కి చేరినట్లవుతుంది.

మొత్తం మీద ఇకపై 90–120, 120–150, 150–180, 180–210 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉండే దేశీ ఫ్లయిట్ల కనిష్ట చార్జీల పరిమితి వరుసగా రూ. 5,300, రూ. 6,700, రూ. 8,300, రూ. 9,800గాను ఉంటుంది. కరోనా వైరస్‌ కట్టడి కోసం గతేడాది రెండు నెలల పాటు విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేశాక మే 25 నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సంక్షోభం లో ఉన్న ఎయిర్‌లైన్స్‌ని గట్టెక్కించే ఉద్దేశంతో ప్రభుత్వం కనిష్ట చార్జీలపైన, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు గరిష్ట చార్జీలపైనా కేంద్రం పరిమితులు విధించింది.

మరిన్ని వార్తలు