80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు

4 Dec, 2020 15:07 IST|Sakshi

80 శాతం దేశీ ఫ్లైట్స్‌ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

6 శాతంపైగా జంప్‌చేసిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌

11 శాతం దూసుకెళ్లిన స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ షేరు

ముంబై, సాక్షి: కోవిడ్‌-19కు ముందున్నస్థాయిలో 80 శాతంవరకూ దేశీ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు తమ సామర్థ్యంలో 80 శాతం విమానాలను నిర్వహించేందుకు వీలు చిక్కింది. ఇందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డవున్‌ విధించిన తదుపరి మే 25న దేశీయంగా విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. రెండు నెలల తరువాత సర్వీసులు ప్రారంభమైనప్పుడు 30,000 మంది ప్రయాణికులు నమోదుకాగా.. నవంబర్‌ 30కల్లా ఈ సంఖ్య 2.52 లక్షలను తాకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ లిస్టెడ్‌ కంపెనీలు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, స్పైస్‌జెట్‌ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పుట్టింది. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండిగో.. గో
ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 1,744 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,747 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దేశీయంగా మే నెలలో 33 శాతం, జూన్‌లో 45 శాతం వరకూ విమానాల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా 70 శాతం నుంచి 80 శాతానికి పరిమితిని పెంచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

స్పైస్‌జెట్‌
దేశీ సర్వీసులలో 80 శాతం వరకూ విమానాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో స్పైస్‌జెట్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9.3 శాతం దూసుకెళ్లి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది. ఇక రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా కల్‌రాక్‌ క్యాపిటిల్‌ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇటీవల జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. వచ్చే(2021) వేసవిలో యూరోపియన్‌ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడటంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు నవంబర్‌ 5న రూ. 79 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు