ట్వీట్ రగడ.. క్షమాపణలు చెప్పిన హోండా, డొమినోస్

9 Feb, 2022 18:02 IST|Sakshi

కాశ్మీర్‌లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ పాకిస్తాన్‌లోని తమ వ్యాపార డీలర్లు సోషల్ మీడియా పెట్టిన పోస్టుల వల్ల భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నందుకు తాము భారత దేశానికి క్షమాపణలు తెలియజేస్తున్నాము అని డొమినోస్, ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా పేర్కొన్నాయి.

ఒక సోషల్ మీడియా పోస్టులో.. "మేము ఈ దేశంలో 25 సంవత్సరాలకు ఉన్నాము. ఈ దేశ ప్రజలు, సంస్కృతి, జాతీయతా స్ఫూర్తిపట్ల మాకు అత్యంత గౌరవం ఉంది. ఈ దేశ ఔన్నత్యాన్ని మేము గౌరవిస్తున్నాము. దేశం వెలుపల నుంచి డొమినోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచురితమైన అవాంఛనీయ సోషల్ మీడియా పోస్టులకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఒక బ్రాండ్‌గా మేము భారతదేశాన్ని గౌరవిస్తాము, ఈ దేశ వినియోగదారులకు & సమాజానికి వినయ, విధేయతలతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము" అని  డొమినోస్ కంపెనీ తెలిపింది.

అదేవిధంగా, హోండా కార్ ఇండియా ట్విటర్ హ్యాండిల్స్ పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో "హోండా పనిచేసే ప్రతి దేశంలో అక్కడి చట్టాల, నిబందనలను అనుసరిస్తాము. ఆ దేశ ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటాము. ఈ విషయంలో దేశ ప్రజలకు ఏదైనా బాధ కలిగితే మేము చింతిస్తున్నాము. తమ కంపెనీ విధానంలో భాగంగా, హోండా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, జాతి, రాజకీయాలు, మతం & సామాజిక సమస్యలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదు" అని తెలిపింది.

ఈ కంపెనీలతో పాటు ఇతర ప్రపంచ స్థాయి సంస్థలు హ్యుందాయ్, సుజుకి, టయోటా, కెఎఫ్సి, పిజ్జా హట్ వంటివి కూడా దేశానికి క్షమాపణలు చెప్పాయి. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీలన్ని కాశ్మీర్‌లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆ కంపెనీ ఉత్పత్తులను అన్నీ మన దేశంలో నిషేదించాలని ప్రజలు కేంద్రాన్ని కోరారు. 

(చదవండి: ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!)

మరిన్ని వార్తలు