అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు

9 Dec, 2020 16:40 IST|Sakshi

కోవిడ్‌-19 వ్యాక్సిన్ల వినియోగంపై యూకే ఆదేశాలు

ఫైజర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఇద్దరిలో తలెత్తిన తీవ్ర అలెర్జీలు

ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగంపై ఎంహెచ్‌ఆర్‌ఏ రియల్‌ టైమ్‌ సమీక్ష

కొత్త వ్యాక్సిన్ల వినియోగంలో ఇలాంటివి సహజమేనంటున్న నిపుణులు

లండన్‌: కోవిడ్‌-19 కట్టడికి యూఎస్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్ అందిస్తున్న వ్యాక్సిన్‌ను గతంలో అలెర్జీల బారినపడిన వ్యక్తులకు వినియోగించవద్దంటూ తాజాగా యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఔషధాలు, ఆహారం లేదా లేదా ఏ ఇతర అలెర్జీ సంబంధ రియాక్షన్స్‌ ఉన్న వ్యక్తులకూ వ్యాక్నిన్‌ను అందించవద్దని పేర్కొంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాక జాతీయ ఆరోగ్య సర్వీసుల(ఎన్‌హెచ్‌ఎస్‌)కు చెందిన ఇద్దరు ఉద్యోగులు అలెర్జిక్‌ రియాక్షన్స్‌కు లోనుకావడంతో యూకే ప్రభుత్వం తాజా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం వ్యాక్సిన్లను అందుకున్న ఈ ఇద్దరు ఉద్యోగులూ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. క్లినికల్‌ పరీక్షలలో ఎదురుకాని ఇలాంటి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎంహెచ్‌ఆర్‌ఏ సీఈవో డాక్టర్‌ జూన్‌ రైనే పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలను జారీ చేయనున్నట్లు వివరించారు. చదవండి: (మార్గరెట్‌- షేక్‌స్పియర్‌.. వీళ్లెవరో తెలుసా?)

సాధారణమే..
జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌ సహకారంతో యూఎస్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను మంగళవారం నుంచీ ఎమర్జెన్సీ ప్రాతిపదికన యూకేలో వినియోగిస్తున్న విషయం విదితమే. ప్రపంచ దేశాలలోనే తొలిసారిగా ఔషధాలు, ఆరోగ్యపరిరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్ఏ) సూచనలమేరకు యూకే ప్రభుత్వం ఇందుకు అనుమతించింది. మంగళవారం తొలిసారిగా 91 ఏళ్ల మహిళ మార్గరెట్‌ కీనన్‌ వ్యాక్సిన్‌ను వేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వ్యాక్సిన్ల వినియోగంలో యూకే ప్రభుత్వ ఆదేశాలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌ఎస్‌ జాతీయ మెడికల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ పోవిస్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త వ్యాక్సిన్ల వినియోగంలో అలెర్జిక్‌ రియాక్షన్స్‌వంటివి సహజమేనని తెలియజేశారు. చదవండి: (జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!)

మరిన్ని వార్తలు