5జీ ట్రయల్స్‌ కోసం స్పెక్ట్రమ్‌ కేటాయింపు

28 May, 2021 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: 5జీ కోసం ఎదురుచూస్తున్న టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. కొద్దీ కాలం క్రితమే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం శాఖ (డాట్‌) తాజాగా ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ట్రయల్స్‌ను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్‌తో సహా ఇతర మెట్రో నగరాల్లో  నిర్వహించనున్నారు. "700 మెగాహెర్ట్జ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెర్ట్జ్ ​​బ్యాండ్, 24.25-28.5 గిగాహెర్ట్జ్ బ్యాండ్లను టెలికాం సంస్థలకు వివిధ ప్రదేశాలలో ట్రయిల్స్ కోసం అనుమతించినట్లు" టెలికాం కంపెనీ అధికారి తెలిపారు. 

5జీ ట్రయల్స్ నిర్వహించడానికి రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టీఎన్‌ఎల్ నుంచి వచ్చిన దరఖాస్తులను మే 4న డీఓటీ ఆమోదించింది. కానీ, చైనా కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని 5జీ కోసం వినియోగించకూడదు అనే షరతు విధించింది. ఈ షరతుకు కట్టుబడి ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్, సీ-డాట్‌లు 5జీ ట్రయల్స్‌ కోసం చేసుకున్న ధరఖాస్తులను కూడా డీఓటీ ఆమోదించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఒక అడుగు ముందుకు వేసి సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ట్రయల్స్ నిర్వహించనుంది. 

ట్రయల్స్‌లో భాగంగా టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ వంటివి పరీక్షించనున్నారు. ప్రస్తుతం ఈ ట్రయల్స్ వ్యవధి 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల కాలంలో 2 నెలలు 5జీ టెక్నాలజీని పరీక్షించే పరికరాలను సమీకరించుకోవడానికే సమయం సరిపోతుంది. ప్రతి కంపెనీ కూడా కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా రూరల్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌లో మాత్రం ఏ కంపెనీకీ స్ప్రెక్ట్రమ్‌ కేటాయించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

చదవండి: చౌక స్మార్ట్‌ఫోన్‌ కోసం జియో, గూగుల్‌ కసరత్తు

మరిన్ని వార్తలు