ప్రైవేట్‌ టెలికం నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు డాట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

11 Aug, 2022 01:08 IST|Sakshi

దరఖాస్తులకు సెప్టెంబర్‌ 9 వరకూ గడువు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ టెలికం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ (డాట్‌) ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రూ. 100 కోట్ల పైగా నికర విలువ ఉండి, డాట్‌ నుండి నేరుగా స్పెక్ట్రం తీసుకోవడం ద్వారా క్యాప్టివ్‌ నాన్‌–పబ్లిక్‌ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్‌) నెలకొల్పాలనుకునే సంస్థలు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్‌ 9 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

సీఎన్‌పీఎన్‌ ఏర్పాటు చేసే సంస్థలకు నేరుగా స్పెక్ట్రంను కేటాయించేందుకు నెలకొన్న డిమాండ్‌ను అధ్యయనం చేసేందుకు కూడా డాట్‌ ఈ ప్రక్రియను ఉపయోగించుకోనుంది. ‘సీఎన్‌పీఎన్‌ నెలకొల్పే సంస్థలు స్పెక్ట్రంను టెలికం సంస్థల నుంచి లీజుకు తీసుకోవచ్చు లేదా డాట్‌ నుంచి నేరుగా తీసుకోవచ్చు’ అని డాట్‌ తెలిపింది.  ప్రస్తుత టెలికం ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎన్‌పీఎన్‌ కోసం స్పెక్ట్రం నేరుగా కేటాయించే ప్రతిపాదనను డాట్‌ తెరపైకి తెచ్చింది.  

మరిన్ని వార్తలు