డోజోన్స్‌ కొత్త రికార్డ్‌- ఎందుకీ స్పీడ్‌?

25 Nov, 2020 11:16 IST|Sakshi

తొలిసారి 30,000 మైలురాయి దాటిన డోజోన్స్‌

షెవ్రాన్‌, జేపీ మోర్గాన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ దన్ను

1987 తదుపరి ఈ నెలలో డోజోన్స్‌ 13 శాతం అప్‌

అదే బాటలో 11 శాతం ర్యాలీ చేసిన ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌

న్యూయార్క్‌, సాక్షి: మంగళవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లలో మరో కొత్త రికార్డ్‌ నమోదైంది. డోజోన్స్‌ 455 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 30,046 వద్ద ముగిసింది. తద్వారా మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 58 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 3,635 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ 156 పాయింట్లు(1.3 శాతం) బలపడి 12,037 వద్ద స్థిరపడింది. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్‌ 13 శాతం దూసుకెళ్లింది. ఇంతక్రితం 1987 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయి లాభాలు ఆర్జించగా.. ఎస్‌అండ్‌పీ 11 శాతం, నాస్‌డాక్‌ 10.3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌ తదుపరి గరిష్టంగా లాభపడ్డాయి.

బ్లూచిప్స్‌ అండ
మంగళవారం డోజోన్స్‌కు బలాన్నిచ్చిన కౌంటర్లలో షెవ్రాన్‌ 5 శాతం, జేపీ మోర్గాన్‌ చేజ్‌ 4.6 శాతం, గోల్డ్‌మన్‌ శాక్స్‌ 3.8 శాతం చొప్పున జంప్‌ చేశాయి. మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇతర కౌంటర్లలో టెస్లా ఇంక్‌ 6.5 శాతం దూసుకెళ్లగా.. ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌, యాపిల్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్‌ 2.5 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున క్షీణించాయి.

జోరు ఎందుకంటే?
ఇటీవల ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌, మోడర్నా ఇంక్‌ కోవిడ్‌-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లు 95 శాతం ఫలితాలనిచ్చినట్లు వెల్లడించడంతో సెంటిమెంటు బలపడింది. ఈ బాటలో బ్రిటిష్‌ కంపెనీ ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రాజకీయ అనిశ్చితులకు చెక్‌ పడటం ఇందుకు సహకరించింది. గతంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌కు చైర్‌పర్సన్‌గా పనిచేసిన జానెట్ యెలెన్‌ను ఆర్థిక మంత్రిగా బైడెన్‌ ఎంపిక చేసుకునే వీలున్నట్లు వెలువడిన వార్తలు ఈ సానుకూల అంశాలకు జత కలసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించే యెలెన్‌ వడ్డీ రేట్లను నేలకు దించడం ద్వారా ఆర్థిక రికవరీకి పాటుపడినట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవకాశమున్నట్లు అంచనాలు బలపడ్డాయి. వెరసి మార్కెట్లు సరికొత్త రికార్డుల బాటలో పరుగు తీస్తున్నట్లు నిపుణులు వివరించారు.

>
మరిన్ని వార్తలు