కోవిడ్‌–19 చికిత్సకు నూతన విధానాలు: రెడ్డీస్‌

24 May, 2021 03:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫార్మా రంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కోవిడ్‌–19 చికిత్సకు నూతన విధానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని నెలల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. మహమ్మారి చికిత్సలో ఉపయోగించే ఔషధాల సరఫరాలో ఎటువంటి ఆటంకం ఉండబోదని స్పష్టం చేసింది. రెమ్‌డెసివిర్‌తోసహా పలు ఔషధాల సరఫరాను డిమాండ్‌కు తగినట్టు పెంచామని వివరించింది.

‘సాధ్యమైన అన్ని మార్గాల్లో, అత్యంత ఆవశ్యకతతో రోగులకు సేవ చేయాలని నిర్ణయించాం. కోవిడ్‌–19 చికిత్సకు కావాల్సిన నివారణ ఔషధాల అభివృద్ధి, వాణిజ్యీకరణకై వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్‌ తెలిపారు. భారత్‌లో తొలి 25 కోట్ల డోసుల స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ విక్రయాలకు తమకు హక్కులు ఉన్నాయని కంపెనీ సీఈవో ఇరెజ్‌ ఇజ్రాయెలీ వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే 12 నెలల్లో ఈ డోసులను సరఫరా చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు