రష్యా వ్యాక్సిన్‌- డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి

16 Sep, 2020 15:07 IST|Sakshi

స్పుత్నిక్‌-Vపై దేశీయంగా క్లినికల్‌ పరీక్షలు

మూడో దశ పరీక్షలు చేపట్టనున్న డాక్టర్‌ రెడ్డీస్

‌వ్యాక్సిన్ పంపిణీకి డాక్టర్‌ రెడ్డీస్‌తో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందం

కోవిడ్‌-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-Vపై దేశీయంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను చేపట్టేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ఆర్‌డీఐఎఫ్‌ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీయంగా డాక్టర్‌ రెడ్డీస్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇవి విజయవంతమైతే నవంబర్‌ తొలి వారానికల్లా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని అభిప్రాయపడింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసేజీలను డాక్టర్‌ రెడ్డీస్‌కు సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. ఈ వివరాలను ఆంగ్ల మీడియా వెల్లడించింది.  

సురక్షితం
ఎడెనోవైరల్ వెక్టర్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ సురక్షితమైనదని డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం సందర్భంగా ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కైరిల్‌‌ దిమిత్రేవ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు మరో నాలుగు దేశీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్న వ్యాక్సిన్లపై ఆసక్తి చూపడం ద్వారా వివిధ దేశాలు, సంస్థలు.. ప్రజలను సంరక్షించుకునేందుకు కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

మానవ ఎడినోవైరల్‌ వెక్టర్స్‌ ద్వారా రూపొందించిన తమ వ్యాక్సిన్‌ను 40,000 మందిపై ప్రయోగించి చూశామని, 250 క్లినికల్‌ డేటాలను విశ్లేషించామని వివరించారు. తద్వారా ఇది సురక్షితమని తేలడమేకాకుండా దీర్ఘకాలంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలనూ చూపలేదని స్పష్టం చేశారు. రష్యాలో తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలు సఫలమయ్యాయని.. దేశీ ప్రమాణాల ప్రకారం మూడో దశ పరీక్షలకు డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు