కోవిడ్‌-19కు డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి ట్యాబ్లెట్లు

19 Aug, 2020 14:48 IST|Sakshi

అవిగాన్‌ బ్రాండుతో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్స్‌ విడుదల

ఓమాదిరి లక్షణాలు కలిగిన వారికి ఉపశమనం: డాక్టర్‌ రెడ్డీస్‌

మార్కెట్లో ప్రవేశపెట్టిన కంపెనీ- ఆన్‌లైన్‌లోనూ అందుబాటు

ప్రస్తుతం జపాన్‌ నుంచి దిగుమతి- త్వరలో దేశీయంగా తయారీ

సెప్టెంబర్‌ తొలి వారానికల్లా రెమ్‌డెసివిర్‌ ఔషధం సైతం విడుదల

కరోనా వైరస్‌ సోకి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించగల ఫావిపిరవిర్‌ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ తాజాగా పేర్కొంది.  అవిగాన్‌ బ్రాండుతో ఈ ఔషధ ట్యాబ్లెట్లను 200 ఎంజీ డోసేజీలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. రెండేళ్ల కాలావధి కలిగిన ఈ ఔషధ పూర్తి ప్యాక్‌ 122 ట్యాబ్లెట్లతో లభిస్తుందని తెలియజేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచనతో ఆన్‌లైన్‌ ద్వారా 42 పట్టణాలలో వీటిని హోమ్‌ డెలివరీ సైతం చేస్తున్నట్లు వివరించింది. హెల్ప్‌లైన్‌ కేంద్రం ద్వారా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.  ఈ బాటలో సెప్టెంబర్‌ మొదటి వారానికల్లా కోవిడ్-19 చికిత్సకు మరో  ఔషధం రెమ్‌డెసివిర్‌ను సైతం మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది.

ఫుజిఫిల్మ్‌ టొయామా నుంచి
జపనీస్‌ దిగ్గజం ఫుజిఫిల్మ్‌ టొయామా కెమికల్‌ కంపెనీ నుంచి పొందిన గ్లోబల్‌ లైసెన్స్‌ ఒప్పందంలో భాగంగా వీటిని విక్రయిస్తున్నట్లు కంపెనీ వర్ధమాన మార్కెట్ల బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ పేర్కొన్నారు. దేశీయంగా వీటి తయారీ, విక్రయం, పంపిణీలకు ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్లను జపాన్‌ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో వీటి తయారీని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కోవిడ్‌-19 కారణంగా ఓమాదిరి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించేందుకుగాను ఈ ట్యాబ్లెకు డీసీజీఐ అనుమతి ఉన్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు