డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 707 కోట్లు

29 Jan, 2022 05:45 IST|Sakshi

ఆదాయం రూ. 5,320 కోట్లు

స్పుత్నిక్‌ ఎం టీకాపై దృష్టి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) రూ. 707 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన సుమారు రూ. 20 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 3,468 శాతం అధికం. నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించి దాదాపు రూ. 597 కోట్ల మేర కేటాయింపులు జరపడం వల్ల గత క్యూ3లో లాభం తక్కువగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఈ తరహా కేటాయింపులు రూ. 4.7 కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఊతంతో ఆదాయం రూ. 4,930 కోట్ల నుంచి రూ. 5,320 కోట్లకు పెరిగింది.

కోవిడ్‌–19 నివారణ, చికిత్సలకు సంబంధించి టీకాలతో పాటు పలు ఔషధాలను ప్రవేశపెడుతున్నామని సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు. మోల్నుపిరావిర్‌ ఔషధానికి మరో ఆరు దేశాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా రెండు దేశాల్లో ఆమోదం లభించిందని కంపెనీ సీఈవో (ఏపీఐ, సర్వీసులు విభాగం) దీపక్‌ సప్రా పేర్కొన్నారు. 12–18 ఏళ్ల వయస్సు గల వారి కోసం ఉద్దేశించిన స్పుత్నిక్‌ ఎం టీకాను భారత్‌లో ప్రవేశపెట్టడంపై త్వరలో ఔషధ రంగ నియంత్రణ సంస్థను సంప్రదించనున్నామని ఆయన వివరించారు. అవసరమైతే దేశీయంగా దీనికి మరో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే అవకాశం ఉందని సప్రా తెలిపారు.
ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో షేరు దాదాపు 1% క్షీణించి రూ. 4,218 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు