డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 579 కోట్లు

30 Jul, 2020 05:09 IST|Sakshi

క్యూ1లో 13 శాతం డౌన్‌

ఆదాయం 15 శాతం వృద్ధి

వచ్చే నెలలో మార్కెట్లోకి రెమిడెసివిర్, ఫావిపిరావిర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 663 కోట్లు. ఇక ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,843 కోట్ల నుంచి రూ. 4,417 కోట్లకు చేరింది. డీఆర్‌ఎల్‌ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి బుధవారం ఈ విషయాలు వెల్లడించారు.

కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలోనూ కార్యకలాపాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాదకతను పెంచుకునే చర్యలు కొనసాగించడం మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. క్యూ1లో అన్ని అంశాల్లోనూ ఆర్థికంగా పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని డీఆర్‌ఎల్‌ సహ–చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వోక్‌హార్డ్‌ నుంచి కొనుగోలు చేసిన వ్యాపారాన్ని డీఆర్‌ఎల్‌ వ్యవస్థకు అనుసంధానించే ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు.  
 
ఆగస్టులో రెండు కోవిడ్‌ ఔషధాలు..
కోవిడ్‌–19 వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు యాంటీ వైరల్‌ ఔషధాలు.. రెమిడెసివిర్, ఫావిపిరావిర్‌ను ఆగస్టులో ప్రవేశపెట్టేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. రెమ్డిసివిర్‌ను వర్ధమా న, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ పేర్కొన్నారు. భారత్‌ సహా 127 దేశాల్లో రెమ్డిసివిర్‌ విక్రయానికి  సంబంధించి అమెరికన్‌ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌తో డీఆర్‌ఎల్‌కు ఒప్పందం ఉంది. అలాగే, అవిగాన్‌ ట్యాబ్లెట్స్‌ (ఫావిపిరావిర్‌) విక్రయానికి సంబంధించి జపాన్‌కు చెందిన ఫ్యూజి ఫిల్మ్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం ఉంది.

గ్లోబల్‌ జనరిక్స్‌కు యూరప్‌ ఊతం..
యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయాలు ఆరు శాతం పెరిగి రూ. 3,507 కోట్లకు చేరింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు అమ్మకాలు పెరగడంతో యూరప్‌లో ఆదాయం 48 శాతం ఎగిసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఆరు శాతం పెరిగింది. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్‌ రేటు ఇందుకు తోడ్పడ్డాయని కంపెనీ తెలిపింది. క్యూ1లో ఉత్తర అమెరికా మార్కెట్లో ఆరు కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు వివరించింది. భారత మార్కెట్‌లో మాత్రం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10 శాతం, సీక్వెన్షియల్‌గా 8 శాతం క్షీణించింది. కరోనా వైరస్‌ పరిణామాలతో అమ్మకాలు క్షీణించడమే ఇందుకు కారణం. తొలి త్రైమాసికంలో దేశీ మార్కెట్లో డీఆర్‌ఎల్‌ నాలుగు కొత్త బ్రాండ్స్‌ను ప్రవేశపెట్టింది.

పీఎస్‌ఏఐకి కొత్త ఉత్పత్తుల తోడ్పాటు
ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు వార్షికంగా 88 శాతం, సీక్వెన్షియల్‌గా 19 శాతం పెరిగాయి. కొన్ని ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరగడం, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు, సానుకూల ఫారెక్స్‌ రేటు ఇందుకు తోడ్పడ్డాయి. సమీక్షాకాలంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 400 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా సంక్లిష్టమైన జనరిక్స్, బయో–సిమిలర్స్‌ తదితర ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడుతోంది. కోవిడ్‌–19 చికిత్స సంబంధ ఔషధాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.    

మరిన్ని వార్తలు