డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 1,113 కోట్లు

29 Oct, 2022 04:32 IST|Sakshi

క్యూ2లో 12%వృద్ధి

ఆదాయం 9% అప్‌; రూ. 6,306 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,113 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 992 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. అటు ఆదాయం 9% పెరిగి రూ. 5,763 కోట్ల నుంచి రూ. 6,306 కోట్లకు చేరింది. శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ, సీఎఫ్‌వో పరాగ్‌ అగర్వాల్‌ ఈ విషయాలు తెలిపారు.

అమెరికా మార్కెట్లో ఎక్స్‌క్లూజివ్‌ హక్కులు లభించిన జనరిక్‌ ఔషధం రెవ్‌లిమిడ్‌ సహా కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్పత్తుల ఊతంతో ఆదాయాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని పరాగ్‌ వివరించారు. అలాగే వ్యయాలను సమర్ధంగా నియంత్రించుకోవడం కూడా దోహదపడిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 25 పైగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

  మరోవైపు, రెండో త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు సాధించడం సంతృప్తి కలిగించిందని సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయంగా చౌకగా మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కొనసాగిస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రెండో త్రైమాసికంలో కంపెనీ సుమారు రూ. 490 కోట్లు వెచ్చించింది.

ఫలితాల్లో ఇతర విశేషాలు..
► క్యూ2లో గ్లోబల్‌ జనరిక్స్‌ ఆదాయాలు 18 శాతం పెరిగి రూ. 5,595 కోట్లకు చేరాయి. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 48 శాతం వృద్ధి చెంది రూ. 2,800 కోట్లకు పెరిగాయి. కొన్ని ఔషధాల రేట్లు తగ్గినప్పటికీ .. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్‌ రేట్ల ప్రభావంతో కంపెనీ ఆ ప్రతికూలతలను
అధిగమించింది.  
► భారత మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ. 1,150 కోట్లకు పరిమితమయ్యాయి.  
► ఫార్మా సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం 23 శాతం క్షీణించి రూ. 643 కోట్లకు తగ్గింది.  

 
శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 4,461 వద్ద క్లోజయ్యింది.  

మరిన్ని వార్తలు