Drogo Drones: ఏపీలో డ్రోగో డ్రోన్స్‌ శిక్షణాకేంద్రం 

16 Feb, 2023 19:49 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో  డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో .. డ్రోన్‌ ఆపరేటర్లను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో శిక్షణ కేంద్రాన్ని డ్రోగో డ్రోన్స్‌ ప్రారంభించింది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ ఏర్పాటైంది. రాష్ట్రంలో డ్రోన్‌ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన  అనుమతులు  పొందిన తొలి ప్రైవేట్‌ సంస్థ తమదేనని డ్రోగో డ్రోన్స్‌ ఎండీ  యశ్వంత్‌ బొంతు తెలిపారు.  

తాడేపల్లిలో రెండు నెలల్లో డ్రోన్స్‌ తయారీ యూనిట్‌ ప్రారంభించనున్నట్టు  వెల్లడించారు. ఎన్‌ఎండీసీ,  జీఎండీసీ, ఎంఈఐఎల్, జీఏఐఎల్, ఏపీఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌ తదితర సంస్థలకు అవసరమైన భూ సర్వేలు చేసినట్లు తెలిపారు. కాగా, పదో తరగతి ఉత్తీర్ణులై, 18 సంవత్సరాలు నిండిన వారు డ్రోన్‌ ఆపరేటర్‌గా శిక్షణ తీసుకోవచ్చు. డీజీసీఏ రూపొందించిన సిలబస్‌ ప్రకారం వారంపాటు శిక్షణ ఉంటుంది. బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఫిబ్రవరి 20 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.  

మరిన్ని వార్తలు