5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్‌’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం!

28 Aug, 2022 10:56 IST|Sakshi

పాత బేసిక్‌ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణవందకోట్ల మార్కు దాటిన డంబ్‌ ఫోన్‌ఈ పరిణామానికి సోషల్‌ మీడియా కూడా కారణమే.. 

స్మార్ట్‌ ఫోన్లు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. జనాభాలో 83 శాతం మందికిపైగా స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. అంటే 600 కోట్ల మంది చేతుల్లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. వన్‌జీ, టూజీ, త్రీజీ, ఫోర్‌జీ పోయి ఇప్పుడు 5జీ వైపు పరుగులు తీస్తోందీ స్మార్ట్‌ఫోన్‌. స్మార్ట్‌ఫోన్ల విజృంభణ ఇంతలా సాగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ వింత పరిణామం మెల్లమెల్లగా చోటు చేసుకుంటోంది. ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం మనం వదిలేసిన బేసిక్‌ ఫోన్‌ అంటే తొలి తరం సెల్‌ ఫోన్‌ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 

గత రెండు మూడేళ్ల నుంచి ఈ బేసిక్‌ ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. బేసిక్‌ ఫోన్, డంబ్‌ ఫోన్,  ఫీచర్‌ ఫోన్, బ్రిక్‌ ఫోన్‌ (మోటోరోలా తయారుచేసిన తొలి సెల్‌ఫోన్‌ ‘డైనాటాక్‌’ ఇటుక సైజులో ఉండేది) అని రకరకాల పేర్లతో పిలిచే తొలితరం సెల్‌ఫోన్‌ అమ్మకాలు ఇటీవల 100 కోట్ల మార్కుకు చేరుకుంది. బుల్లితెర, ప్రెస్‌ బటన్లు, క్వెర్టీ  కీబోర్డు, స్నేక్‌ గేమ్, ఓ మాదిరి రేడియోతో ఫోన్‌ చేయడానికి, మెసేజులు పంపడానికి మాత్రమే ఉపయోగపడే ఇలాంటి డంబ్‌ ఫోన్ల కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసే వారి సంఖ్య 2018 నుంచి 2021 మధ్య 89 శాతం పెరిగింది. గత ఏడాది స్మార్ట్‌ ఫోన్ల విక్రయం 140 కోట్లు ఉండగా బేసిక్‌ ఫోన్ల అమ్మకం 100 కోట్లకు చేరిందని సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ‘సెమ్‌ రస్‌’ నివేదిక. బ్రిటన్‌ లో ప్రతి 10 మందిలో ఒకరి దగ్గర డంబ్‌ ఫోన్‌ ఉందని డెలాయిట్‌ చెబుతోంది. 

షేర్‌ మార్కెట్‌ కింగ్‌ వారెన్‌ బఫెట్‌ ఇటీవల కాలం వరకు సామ్‌సంగ్‌ బేసిక్‌ ఫోన్‌ ఎస్‌సీహెచ్‌– 320 వాడేవారు. ఇటీవల ఆయన ఐఫోన్‌కు మారారు. అదీ ఎవరో బహుమతిగా ఇచ్చిందే. ఆపిల్‌ కంపెనీలో షేర్లు ఉన్న బఫెట్‌ ఏ రోజూ ఐఫోన్‌ జోలికి వెళ్లలేదు. డంబ్‌ ఫోన్‌ తోనే కాలం గడిపారు. ఇప్పుడు కూడా ఈ ఐఫోన్‌–11ని కేవలం ఫోన్‌ లా మాత్రమే వాడతానంటున్నారు.

సోషల్‌ మీడియా సైడ్‌ ఎఫెక్ట్‌
లెక్కలేనన్ని ఫీచర్లు, ఆడియో, వీడియో స్ట్రీమింగ్, జీపీఎస్‌ సౌకర్యం,  ఇంటర్నెట్‌ ద్వారా సమస్త సమాచారం, సదుపాయాలు ప్రతి అవసరానికీ అంది వచ్చే యాప్‌లు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ లను వీడి.. చాలామంది మళ్లీ వెనక్కి సాధారణ బేసిక్‌ ఫోన్‌ వైపు మళ్లడానికి సోషల్‌ మీడియా ఓ ప్రధాన కారణం. అనేకానేక సౌకర్యాలను ఇచ్చే స్మార్ట్‌ ఫోన్స్‌ మోజులో కొట్టుకుపోయిన వీరంతా ఇప్పుడు దాని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ని గుర్తించి వెనక్కి వెళ్తున్నారు.

‘సోషల్‌ మీడియా యాప్స్‌ తో నిండిపోయిన నా ఫోన్‌తో నా రోజంతా గడిచి పోయేది. ఈ స్మార్ట్‌ ఫోన్‌తో నేనేం కోల్పోయానో అర్థం అయింది. అందుకే ఇప్పుడు పాత డంబ్‌ ఫోన్‌ కొన్నాను. నా వ్యక్తిగత జీవితం మళ్ళీ నా చెంతకు వచ్చింది’ అని లండన్‌కు చెందిన 17 ఏళ్ల రాబిన్‌ వెస్ట్‌ బీబీసీకి చెప్పింది. ‘ఫోన్ల అసలు అవసరం మరిచిపోయేలా చేసింది స్మార్ట్‌ ఫోన్‌. ఫోన్‌ చేసి నలుగురితో మాట్లాడటం మానేసి సోషల్‌ మీడియా సమాచారం, కామెంట్లు, లైకులు, షేరింగ్‌లతో కాలం గడిపేస్తున్నాం’ అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన టెక్నాలజీ నిపుణులు ప్రొఫెసర్‌ సాండ్రా వాచర్‌ అంటున్నారు.

ఓ సాధారణ వ్యక్తి ఏడాదిలో 52,925 నిమిషాలు సోషల్‌ మీడియాలో టైపింగ్‌ కోసం వెచ్చిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ స్టార్‌లిస్ట్‌ వెల్లడించింది. అమెరికన్‌ పౌరుడు ఏడాదికి 109 రోజుల సమయాన్ని యాప్స్, వెబ్స్‌ చూడడంలో గడిపేస్తున్నాడు. స్మార్ట్‌ ఫోన్‌ వ్యసనంగా మారి 39 శాతం యువత నిద్రలేమితో సతమతమ­వుతున్నట్టు లండన్‌ కింగ్స్‌ కాలేజీ సైకాలజీ విభాగం పరిశోధనలో వెళ్లడైంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచేందుకు వారికి బేసిక్‌ ఫోన్లు మాత్రమే అందిస్తున్నారు.

పేదరికమూ ఓ కారణం
ఫీచర్‌ ఫోన్ల వ్యాప్తికి పేదరికం కూడా ఒక కారణం. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పేదరికంతో మగ్గుతున్న కోట్లాదిమందికి స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలుచేసే శక్తి లేక చవకగా దొరికే బేసిక్‌ ఫోన్లతో అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 250 రూపాయలకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న వారు 200 కోట్ల మంది ఉన్నారు. ఈ వర్గంలో బేసిక్‌ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉందని కౌంటర్‌ పాయింట్‌ అనే పరిశోధనా సంస్థకు చెందిన అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ చెబుతున్నారు.

 భారతదేశంలో ఈ డంబ్‌ ఫోన్లను వాడుతున్న వారు 32 కోట్ల మంది ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించి భారత రిజర్వు బ్యాంకు బేసిక్‌ ఫోన్ల ద్వారా కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులకు వీలు కల్పించే ప్రోగ్రాంలను రూపొందించింది. కరెంటు ఎక్కువగా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాటరీ రీచార్జింగ్‌ సౌకర్యం తక్కువగా ఉంటుంది. అలాంటిచోట ఒకసారి బ్యాటరీ చార్జ్‌ చేస్తే నాలుగైదు రోజులు పనిచేసే బేసిక్‌ ఫోన్‌ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.

::: దొడ్డ శ్రీనివాసరెడ్డి

చదవండి👉 మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

మరిన్ని వార్తలు