మొండి పద్దులు పెరుగుతాయ్‌  

27 Aug, 2020 07:29 IST|Sakshi

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు తప్పనిసరి 

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. చాలా మటుకు బాకీలను దివాలా చట్టం వెలుపలే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీ మొండిబాకీల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు (బ్యాడ్‌ బ్యాంక్‌) ఏర్పాటు తప్పనిసరైన అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘అత్యంత జాగ్రత్తగా రూపొందించిన, విజయవంతంగా నిర్వహిస్తున్న బ్యాడ్‌ బ్యాంకులు కొన్ని ఉన్నాయి.

ఇలాంటి వాటిల్లో మలేషియాకు చెందిన దానహర్త కూడా ఒకటి. మనకంటూ బ్యాడ్‌ బ్యాంకును ఏర్పాటు చేసుకునే క్రమంలో దానహర్త మోడల్‌ను అధ్యయనం చేయవచ్చు’ అని దువ్వూరి చెప్పారు.  దివాలా చట్టం (ఐబీసీ) కోడ్‌ కింద కేసులు ఇప్పటికే పేరుకుపోయాయని, కొత్తగా వచ్చేవి న్యాయస్థానాలపై మరింత భారంగా మారతాయని తెలిపారు. కాబట్టి ఐబీసీ పరిధికి వెలుపలే చాలా మటుకు బాకీల పరిష్కారం చోటు చేసుకోవాల్సి రావచ్చని  పేర్కొన్నారు.  దివాలా చట్టంతో మొండిబాకీల సమస్య పరిష్కారం కాగలదని, బ్యాడ్‌ బ్యాంక్‌ అవసరం ఉండదని గతంలో భావించానని దువ్వూరి చెప్పారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ అభిప్రాయం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు