2021లో ఈ-కామర్స్ రంగాల్లో భారీగా పెరిగిన నియామకాలు

30 Dec, 2021 21:22 IST|Sakshi

మరింత ఆశావహంగా 2022 

టీమ్‌లీజ్‌ నివేదిక 

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2021) ఈ-కామర్స్, అనుబంధ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 28 శాతం పెరిగాయి. ఎకానమీ రికవరీ, వేగవంతమైన టీకాల ప్రక్రియ వంటి అంశాల దన్నుతో ఈ సెగ్మెంట్‌లో రిక్రూట్‌మెంట్‌ వచ్చే ఏడాది మరింతగా పుంజుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ-కామర్స్‌ రంగం 2020లో 8 శాతం, 2021లో 30 శాతం మేర వృద్ధి చెందింది.

2024 నాటికి ఇది 111 బిలియన్‌ డాలర్లకు, 2026 నాటికి 200 బిలియన్‌ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ విభాగం..ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగావకాశాలకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ–కామర్స్, అనుబంధ రంగాల్లో (ఈ-కామర్స్, ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు మొదలైనవి) ఈ ఏడాది ఉద్యోగావకాశాలు 28 శాతం మేర పెరిగినట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ థామస్‌ తెలిపారు.  

వచ్చే ఏడాది 32 శాతం వరకూ అప్‌.. 
ఈ–కామర్స్, స్టార్టప్‌లలో 2022లో కొత్తగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరగగలదని, నియాకాల వృద్ధి 32 శాతం వరకూ నమోదు కావచ్చని థామస్‌ పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థ నిర్వహణ, వేర్‌హౌస్‌లో వివిధ ఉద్యోగాలు, సపోర్టు సేవలు, కస్టమర్‌ సర్వీస్‌ నిర్వహణ తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్‌ విస్తరిస్తుండటంతో కేవలం ప్రథమ శ్రేణి నగరాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నుంచి నాలుగో శ్రేణి ప్రాంతాల వరకూ అన్ని చోట్ల హైరింగ్‌ జోరు అందుకుందని నివేదిక పేర్కొంది.

ఈ రంగాల్లో వేతనాల పెంపు సగటున 20–30 శాతం స్థాయిలో ఉంటోందని, చాలా కంపెనీలు అటెండెన్స్‌ విధానాలను సడలించడం, అదనంగా సిక్‌ లీవులు ఇవ్వడం మొదలైన రూపాల్లో ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయని తెలిపింది. ఈ-కామర్స్, టెక్‌ స్టార్టప్‌లకు వచ్చే ఏడాది మరింత ఆశావహంగా ఉండగలదని అయితే ఆయా విభాగాలు వృద్ధి చెందడానికి మరిన్ని సంస్కరణలు, ఆర్థిక సహా యం అవసరమవుతాయని వివరించింది. ఉత్పత్తు లు, సర్వీసుల విభాగాల్లో కొత్త వ్యాపార విధానాల ను రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం కూడా గుర్తించి, తగు తోడ్పాటు ఇవ్వాలని నివేదిక తెలిపింది. 

(చదవండి: బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!)

మరిన్ని వార్తలు