డీల్‌షేర్‌ నుంచి 4,000 ఉద్యోగాలు

17 Sep, 2021 10:17 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ కామర్స్‌ కంపెనీ డీల్‌షేర్‌ రానున్న ఆరు నెలల్లో కొత్తగా 4,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతమున్న 1,000 మంది సిబ్బందిని 5,000కుపైగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. కార్యకలాపాలను భారీస్థాయి లో విస్తరించేందుకు వీలుగా 10 కోట్ల డాలర్లు (రూ. 736 కోట్లు) సైతం ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది.

తద్వారా వివిధ విభాగాలలో వేగంగా విస్తరించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇటీవలే టైగర్‌ గ్లోబల్, వెస్ట్‌బ్రిడ్జి క్యాపిటల్, అల్ఫావేవ్‌ ఇన్‌క్యుబేషన్‌ తదితర దిగ్గజాల నుంచి 14.4 కోట్ల డాలర్లు సమీకరించింది. కోవిడ్‌–19 సవాళ్లు విసిరినప్పటికీ కస్టమర్‌ బేస్‌ భారీగా ఎగసినట్లు డీల్‌షేర్‌ వ్యవస్థాపకుడు, సీఈ వో వినీత్‌ రావు తెలియజేశారు. ప్రస్తుతం స్థూల మెర్కండైజ్‌ విలువ(జీఎంవీ) 40 కోట్ల డాలర్ల రన్‌రేట్‌ను తాకినట్లు వెల్లడించారు. 

5 రాష్ట్రాలలో 45 పట్టణాలలో విస్తరించినట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివరికల్లా 100 కోట్ల డాలర్ల జీఎంవీ రన్‌రేట్‌ను అందుకోగలమన్న విశ్వాసా న్ని వ్యక్తం చేశారు. నిర్వహణ సామర్థ్యం, ప్రొడక్ట్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా సైంటిస్టులు, మార్కెటింగ్, పంపిణీ తదితర విభాగాల లో కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు