దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ స్పోర్ట్స్‌ పరిశ్రమ

30 Jun, 2021 09:27 IST|Sakshi

2025 నాటికి 1,100 కోట్లకు పరిశ్రమ 

వచ్చే నాలుగేళ్లు ఏటా 46 శాతం వృద్ధి 

ఈవై నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్‌ స్పోర్ట్స్‌ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఈ పరిశ్రమ నాలుగు రెట్లు పెరిగి రూ.1,100 కోట్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. క్రీడాకారుల్లో నైపుణ్యం, కోవిడ్‌తో ఇంటికే ఎక్కువ సమయం పరిమితం అవటం, మొబైల్‌ వినియోగం పెరగడం వంటివి పరిశ్రమ వృద్ధికి కారణాలని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ రూ.250 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా 46 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ మాదిరిగా కాకుండా ఈ–స్పోర్ట్స్‌ అనేది నైపుణ్యం కలిగిన ఆన్‌లైన్‌ ఆటలుగా పరిగణిస్తారు. జట్లుగా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీల రూపంలో టోర్నమెంట్లు, లీగ్‌లు ఆడి టైటిల్స్‌ను గెలుచుకుంటారు. 2025 నాటికి దేశీయ ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమలో క్రీడాకారుల సంఖ్య 15 లక్షలకు, 2.50 లక్షల జట్లకు చేరుతుందని తెలిపింది.

ప్రస్తుతం 1.50 లక్షల మంది ప్లేయర్లు, 60 వేల బృందాలున్నాయి. ఇదే సమయంలో భారతీయ ఈ–స్పోర్ట్స్‌ ప్రైజ్‌ మనీ ఏటా 66 శాతం వృద్ధి రేటుతో రూ.100 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్‌ ప్రైజ్‌ మనీ భారతీయ ఈ–స్పోర్ట్స్‌ ప్రైజ్‌ మనీ 0.6 శాతమే ఉందని.. 2025 నాటికి 2 శాతానికి చేరుతుందని తెలిపింది. ప్రేక్షకులు, ఈ–స్పోర్ట్స్‌ టోర్నమెంట్ల సం ఖ్య పెరగడంతో ప్రకటనదారులు, ఏజెన్సీలు వ్యూ యర్‌షిప్‌ను చేరుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నా యని తెలిపారు.

ఈ–స్పోర్ట్స్‌ ఆదాయంలో మెజారిటీ వాటా అయిన ప్రకటనల విభాగం 2025 నాటికి ప్రకటనల ఆదాయం నాలుగు రెట్ల వృద్ధితో రూ.650 కోట్లకు చేరుతుంది. టోర్నమెంట్‌ స్పాన్సర్‌షిప్, సిండికేషన్‌ విభాగాల ఆదాయం ఏటా 45 శాతం వృద్ధి రేటుతో రూ.350 కోట్లకు చేరుతుందని ఈవై ఇండియా పార్టనర్, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లీడర్‌ ఆశీష్‌ ఫెర్వానీ తెలిపారు.  

చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు