గుడ్‌న్యూస్‌! రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు

2 Jun, 2022 18:21 IST|Sakshi

EV Stations in Hyderabad: రైల్వే శాఖ ఎలక్ట్రిక్‌ వాహనదారులకు శుభవార్త తెలిపింది.  రైల్వే ప్రాంగణాల్లో  ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఫేజ్‌1లో తొలి స్టేషన్‌ను  హైదరాబాద్‌ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌లో ప్రారంభించింది. త్వరలోనే నగరంలో మరిన్ని స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనుంది.

ఈవీ ఛార్జింగ్‌ పాయింట్స్‌
పర్యావరణ హితమైన ఈవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈవీ కార్లు, స్కూటర్లు, బైకులు కొన్న వారికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సహాకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే ఇంటి బయట ఛార్జింగ్‌ స్టేషన్లు విరివిగా లేకపోవడం పెద్ద లోపంగా మారింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రోత్సహిస్తోంది. 

జంటనగరాల్లో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌ జోన్‌లో ఫస్ట్‌ ఫేజ్‌లో మొత్తం 32 స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి స్టేషన్‌ నాంపల్లిలో ప్రారంభం అయ్యింది. ఇది కాకుండా హైదరాబాద్‌ నగర పరిధిలో బేగంపేట, హైటెక్‌సిటీ, ఘట్‌కేసర్‌, లక్‌డీకాపూల్‌, ఫతేనగర్‌, నెక్లస్‌రోడ్‌, సంజీవయ్య పార్కు స్టేషన్లలో కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణలో
ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను వరంగల్‌, కాజీపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మధిర, భద్రాచలంరోడ్‌, భువనగిరి, జనగామ, జమ్మికుంట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, వికారాబాద్‌, తాండూర్‌, జహీరాబాద్‌, కరీంనగర్‌ స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. 

చదవండి: ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా

మరిన్ని వార్తలు