Fuel Shortage In Sri Lanka: రెండు వారాలు ఇంటినుంచే పని

18 Jun, 2022 10:48 IST|Sakshi

కొలంబో: గత ఏడుదశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   తీవ్రమైన  పెట్రోలు కొరత కారణంగా  ప్రభుత్వ ఉద్యోగులు రెండు వారాల పాటు ఇంటి నుంచి పని చేయాలని శుక్రవారం ఆదేశించింది.

ఇంధన సరఫరాపై ఆంక్షలు, బలహీనమైన ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ సర్క్యులర్‌ జారీ చేశామని  మినిమం స్టాఫ్‌ సోమవారం నుండి పనికి రావచ్చని శ్రీలంక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఫలితంగా సుమారు పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులలో, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరమైన సేవలను అందించే వారు మాత్రమే ఆఫీసు డ్యూటీకి రిపోర్టు చేస్తారని  పేర్కొంది. (అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్‌ పాటకు డాన్స్‌తో ఫిదా!)

విదేశీ మారకద్రవ్య నిధులు అడుగంటిపోవడంతో ఇంధనం కోసం శ్రీలంక అష్టకష్టాలు పడుతోంది. రానున్న ఆహారకొరత భూతం మరింత వణికిస్తోంది. మరోవైపు పెట్రోలు, డీజిల్‌ కోసం పెట్రో బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో జనాలు నానా అగచాట్లు పడుతున్నారు.   కొంతమంది వినియోగదారులు పెట్రోలు కోసం ఏకంగా  10 గంటలకు పైగానే వేచి ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతమున్న స్టాక్ పెట్రోల్, డీజిల్ కొద్ది రోజుల్లో అయిపోనుందనే ఆందోళన వెంటాడుతోంది. కోవిడ్‌-19, ఇటీవలి రాజకీయ సంక్షోభం లాంటి పరిణామాల నేపథ్యంలో 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఎన్నడూ లేనంత  ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. కాగా  బెయిలౌట్ ప్యాకేజీ కోసం దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థతో కొలంబోలో ఒక ప్రతినిధి బృందం చర్చలు జరపనుంది.

రాబోయే నెలల్లో 5 మిలియన్ల మంది శ్రీలంక వాసులు ఆహార కొరతతో ప్రత్యక్షంగా ప్రభావితం కావచ్చని ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రాబోయే నాలుగు నెలల్లో మరింత సంక్షోభంలోకి జారిపోనున్న 1.7 మిలియన్ల శ్రీలంక పౌరులకు సహాయం అందించేందుకు 47 మిలియన్ డాలర్లు సేకరించేలా  ఐక్యరాజ్యసమితి  కసరత్తు చేస్తోంది. 

మరిన్ని వార్తలు