Corona Crisis: నోట్లు ముద్రించి ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేయండి

8 Jun, 2021 10:29 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకి ఆర్థిక వేత్తల సూచనలు 

కరోనా సంక్షోభం నుంచి బయటపడానికి ఇదే మార్గం

నగదు ముద్రించే ఆలోచనే లేదంటున్న ఆర్‌బీఐ

రుణ సమీకరణకే ఆర్బీఐ మొగ్గు

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యం

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 తో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇండియా త్వరగా కోలుకోవాలంటూ ఇందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరింత నగదును ముద్రించి ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. అమెరికా, యూరోప్, జపాన్‌ వంటి దేశాలు ఈ విధంగానే నగదు ముద్రించి వ్యవస్థలోకి వదిలాయని, అదే విధంగా ఇండియా కూడా చేయాలంటూ మాజీ ఆర్థికమంత్రులు, ఆర్థిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా గొంతుకలుపుతున్నాయి.

అక్కడ అలా
కోవిడ్‌ వచ్చిన తర్వాత అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ తన బ్యాలెన్స్ షీట్‌ను భారీగా పెంచుకుంది. కోవిడ్‌ ముందు 4.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న అమెరికా కేంద్ర ఫెడరల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీటు ఇప్పుడు 7.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఇదే విధంగా ఆర్‌బీఐ కూడా బ్యాలెన్స్‌ షీటు పెంచుకోవడం ద్వారా ప్రజల చేతిలో నగదు ఉంచాలన్నదిన ఆర్థికవేత్తల డిమాండ్‌. మన దేశంలో కూడా నగదు ముద్రించి ప్రజల ఖాతాల్లోకి వేయడం ద్వారా వాళ్లకు కొనుగోళ్ల శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుందన్నది వీరి వాదన. ఇదే సమయంలో మరికొంత మంది ఆర్థిక వేత్తలు నగదు ముద్రణను వ్యతిరేకిస్తున్నారు. నగదు ముద్రణ చేస్తే రూపాయి విలువ పతనం కావడంతో పాటు, ద్రవ్యోల్బణం కట్టడి చేయలేని స్థాయికి చేరుకుంటుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు జింబాబ్వే, వెనిజులా దృష్టాంతాలను ఉదాహరణలుగా పేర్కొంటున్నారు. ఇలా ఆర్థికవేత్తలు రెండుగా విడిపోయి ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో నాలుగు రోజుల క్రితం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నగదు ముద్రణపై ఒక స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మర్ని కరెన్సీ నోట్లు ముద్రించే అవకాశం లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. నోట్ల ముద్రణ విషయంలో ఆర్‌బీఐకి సొంత విధానం ఉందని, ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణం, విదేశీ మారకం రేట్లు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుంకుంటామన్నారు. 

రుణాలకే మొగ్గు... 
ఆర్‌బీఐ నేరుగా నగదు ముద్రణ చేయకుండా పరోక్షంగా వ్యవస్థలోకి నగదు పంపిణీ చేయడానికే మొగ్గు చూపుతోంది. నేరుగా నగదు ముద్రణ చేయడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న భయమే దీనికి కారణం. అందుకే నేరుగా ప్రభుత్వం నుంచి బాండ్లను కొనుగోలు చేసి ఆర్‌బీఐ తన వద్ద ఉన్న నగదును ప్రభుత్వానికి అందిస్తోంది. ఇందుకోసం ఆర్‌బీఐ ఏకంగా గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ అక్విజిషన్‌ పోగ్రాం (జీ–సాప్‌) ద్వారా రూ.1.2 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక విధంగా ఆర్‌బీఐ డిజిటల్‌ రూపంలో నగదు ముద్రించడం కిందకు వస్తుంది. అలాగే కేంద్రం 2021–22 బడ్జెట్‌లో రుణాల రూపంలో రూ.7.8 లక్షల కోట్లు సమీకరించినట్లు చెప్పినా ఇప్పుడు ఆ విలువను ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. దీనివల్ల ద్రవ్యలోటు పెరిగినా పెద్ద ఇబ్బంది లేదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. చాలా దేశాలు వాటి జీడీపీలో 90 శాతం వరకు అప్పులు ఉన్నాయని, కానీ మన దేశంలో అప్పుల విలువ 70 శాతంలోపే ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదన్నది వీరి వాదన. 

జీడీపీ ఆధారంగా నగదు ముద్రణ 
ఎంత నగదు చలామణీలో ఉంచాలన్నది దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) ఆధారంగా నిర్ణయిస్తారు. 50–60వ దశకంలో దేశంలో ఉన్న బంగారు నిల్వలు ఆధారంగా ఎంత నగదు ఉండాలన్నది లెక్కించే వారు. ఆ తర్వాత ఈ విధానాన్ని ఆపేసి జీడీపీ ఆధారంగా ముద్రించడం మొదలు పెట్టారు. ప్రస్తుత ధరల ప్రకారం 2020–21 నాటికి మన జీడీపీ (కరెంట్‌ ప్రైసెస్‌ ప్రకారం) 195.86 లక్షల కోట్లు. జీడీపీ పెరుగుతూ, నగదు లావాదేవీలు పెరుగుతుంటూ ఆ మేరకు ఆర్‌బీఐ నగదు ముద్రణ చేపడుతుంది. కోవిడ్‌ తర్వాత దేశంలో ఒక్కసారిగా నగదు లావాదేవీలు పెరిగాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్‌23 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రికార్డు స్థాయిలో రూ.29,07,067 కోట్లకు చేరింది. ఒకపక్క డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నా నగదు లావాదేవీలు పెరగడం గమనార్హం. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకొని ఉంచుకోవడం దీనికి కారణం. దీనికి సగటు ఖాతాదారుని ఏటీఎం వినియోగం విలువ పెర గడం ఉదాహరణగా బ్యాంకులు పేర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా సగటు ఏటీఎం విత్ర్‌డ్రాయల్‌ విలువ రూ.4,000గా ఉంటే ఇప్పుడిది రూ.4,500కు చేరుకుందంట.

ఇదే సరైన సమయం – కోటక్, ఎండీ, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ 
ఆర్‌బీఐ మద్దతుతో ప్రభుత్వం బ్యాలెన్స్‌ షీట్‌ను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. వ్యవస్థలో ద్రవ్య సరఫరా పెంచడం లేదా నగుదును ముద్రిచాలి. ఇది ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడూ చేయలేం.

నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి – అభిజిత్‌ బెనర్జీ, నోబెల్‌ పురస్కార గ్రహీత 
పేద ప్రజలను ఆదుకోవడానికి నగదు ముద్రించి నేరుగా వారి ఖాతాల్లో వేయాలి.


ద్రవ్యలోటుపై యోచించే సమయం కాదు – చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి
ద్రవ్యలోటు పెరుగుపోతుందని చూడకుండా నగదు ముద్రించి ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచాలి.

ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది – కే నరసింహ మూర్తి, ఆర్థికరంగ నిపుణులు 
నగదు ముద్రించి ప్రజల ఖాతాల్లో వేస్తే ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. కాబట్టి ఇది మంచి నిర్ణయం కాదు. జీడీపీలో అప్పులు విలువ ఇంకా తక్కువగానే ఉంది. ఏటా జీడీపీ పెరుగుతోంది కాబట్టి కేంద్రం భారీగా అప్పులు చేసినా పెద్ద ఇబ్బంది లేదు. ఒక్కసారి సంక్షోభం ముగిసన తర్వాత ఆదాయం పెంచుకోవడం ద్వారా అప్పులు తగ్గించుకోవచ్చు. 
 

మరిన్ని వార్తలు