రాణా కపూర్‌ రూ.127 కోట్ల ఫ్లాట్‌... ఈడీ జప్తు

26 Sep, 2020 06:59 IST|Sakshi

సెబీ రూ.కోటి జరిమానా... మరో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్‌బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్‌లో ఉన్న రూ.127 కోట్లు (13.5 మిలియన్‌ పౌండ్లు) విలువచేసే  ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. మరోవైపు పలు కీలక లావాదేవీల విషయాన్ని వెల్లడించనందుకుగాను మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ రాణా కపూర్‌కు రూ.కోటి జరిమానా విధించింది.  ఈడీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లండన్, 77 సౌత్‌ ఆడ్లీలో అపార్ట్‌మెంట్‌లో ఈ ఫ్లాట్‌ ఉంది.

డీఓఐటీ క్రియేషన్స్‌ జర్సీ లిమిటెడ్‌ పేరుతో 2017లో రూ.93 కోట్లకు (9.9 మిలియన్‌ పౌండ్లు) రాణా కపూర్‌ ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.  రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని  పలు సంస్థలకు యస్‌బ్యాంక్‌ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. దీని ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది.  రాణా కపూర్‌తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై మనీలాండరింగ్‌ కేసు నమోదయ్యింది.  ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.2,011 కోట్లు. 

సెబీ జరిమానా ఎందుకంటే..:   రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఇప్పుడు నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌) నుంచి యస్‌బ్యాంక్‌ అన్‌లిస్టెడ్‌ ప్రమోటర్‌ సంస్థ అయిన మోర్గాన్‌ క్రెడిట్స్‌ రూ.950 కోట్లను సమీకరించింది. 2018లో అన్‌లిస్టెడ్‌ జీరో కూపన్‌ నాన్‌–కన్వెర్టబుల్‌ డిబెంచర్ల ద్వారా ఈ నిధుల సమీకరణ జరిగింది. యస్‌బ్యాంక్‌ ప్రమోటర్‌ కూడా అయిన కపూర్, గ్యారంటార్‌గా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఈ లావాదేవీకి సంబంధించి పూర్తి వివరాలు బ్యాంక్‌ డైరెక్టర్లకు తెలియజేయలేదు. ఈ వ్యవహారం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌కు సంబంధించి యస్‌బ్యాంక్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.  

నంజున్‌దయా ఆయన కుటుంబ సభ్యుల రూ.255.17 కోట్ల ఆస్తులపైనా కొరడా...
కాగా, ఇన్వెస్టర్లను భారీగా మోసం చేసిన కేసులో కన్వా గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకుడు ఎన్‌ నంజున్‌దయా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.255.17 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం విడుదల చేసిన మరో ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలోని స్థిరాస్తులతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌లు ఉన్నాయి. బెంగళూరులోని కార్పొరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ తాజా చర్యలు తీసుకుంది. శ్రీ కన్వా సౌహార్థ సహకార క్రెడిట్‌ లిమిటెడ్‌ ద్వారా అధిక వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి రూ.650 కోట్లు వసూళ్లు జరిపారని, ఈ విషయంలో నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఆగస్టు 25న నంజున్‌దయా అరెస్టయ్యారు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిందితుడు రూ.120 కోట్ల రుణాలను పొందినట్లు కూడా కేసు నమోదయ్యింది.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు