హర్ష్‌ మాండర్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు.. ఖండిస్తున్న మేధావులు

17 Sep, 2021 10:11 IST|Sakshi

మాజీ ఐఏఎస్‌ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్‌ మాండర్‌(66) ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ తనీఖీలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదంతా కేంద్రం కుట్రగా ఆరోపిస్తూ.. సుమారు 600 మంది ఉద్యమకారులు, మేధావులు.. ఈ దాడుల్ని ఖండిస్తూ సంతకాలు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు సయ్యద్‌ హమీద్‌, ఆర్థికవేత్త జీన్‌ డ్రెజె, మేధా పాట్కర్‌ తదితరులు సంతకాలు చేసిన వాళ్లలో ఉన్నారు.
 

సోషల్‌ యాక్టివిస్ట్‌ హర్ష్‌ మాండర్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ గురువారం హడావిడిగా తనిఖీలు నిర్వహించింది. మాండర్‌ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌(CES) మీద ఢిల్లీ పోలీస్‌ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేపటినట్లు సమాచారం.  

బెర్లిన్‌ రాబర్ట్‌ బోస్చ్‌ అకాడమీలో జరిగే ఓ కార్యక్రమం కోసం మాండర్‌ గురువారం జర్మనీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈడీలు సోదాలు నిర్వహించడం విశేషం. మాండర్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ ఏజెన్సీ సోదాలు నిర్వహించగా, దర్యాప్తునకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఈడీ అధికారులు ఇష్టపడలేదు. దక్షిణ ఢిల్లీలోని అడ్చిని, మెహ్రౌలీ, వసంత్‌ కుంజ్‌ ప్రాంతాల్లోని మాండర్‌ ఆఫీసుల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే తనిఖీలకు పూర్తిగా సహకరించినట్లు సీఈఎస్‌ ప్రకటించుకుంది. 

ఉదయం ఉద్యోగుల్ని బయటే ఆపేసి ఈడీ తనిఖీలు కొనసాగించింది.  ఇదిలా ఉంటే కిందటి ఏడాది అక్టోబర్‌లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్‌.. సీఈఎస్‌ నిర్వహించే రెండు బాలల గృహాలను సందర్శించింది. సక్రమంగా నడిపించకపోవడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది. ఆ వెంటనే  ఢిల్లీ పోలీసులు సీఈఎస్‌ మీద జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ మీద ఓ కేసు, లావాదేవీల అవకతవకలకు సంబంధించి మరో కేసు నమోదు చేశారు.

హాట్‌ న్యూస్‌: సోనూసూద్‌పై ఐటీ దాడులు

మరిన్ని వార్తలు