భారీగా వంట నూనెల దిగుమతులు

15 Dec, 2022 04:26 IST|Sakshi

నవంబర్‌లో 15.29 లక్షల టన్నులు

ఏడాది క్రితంతో పోలిస్తే 34 శాతం ఎక్కువ

సింహ భాగం పామాయిలే

న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు నవంబర్‌లో గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 11,38,823 టన్నులతో పోల్చి చూస్తే, 32 శాతం పెరిగి 15,28,760 టన్నులకు చేరాయి. ముఖ్యంగా ముడి పామాయిల్, రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతులు అధికంగా జరిగినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) ప్రకటించింది. నవంబర్‌ నెలకు సంబంధించి వంట నూనెలు, ఇతర నూనెల దిగుమతుల గణాంకాలను ఎస్‌ఈఏ బుధవారం విడుదల చేసింది. వంట నూనెలకు సంబంధించి 2022–23 మార్కెటింగ్‌ సంవత్సరంలో నవంబర్‌ మొదటి నెల అవుతుంది.

పామాయిల్‌ రికార్డులు  
► మొత్తం నూనెల దిగుమతులు నవంబర్‌ నెలకు 15,45,540 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి 11,73,747 టన్నులుగా ఉన్నాయి.  
► కేవలం వంట నూనెల దిగుమతులు 15,28,760 టన్నులకు చేరాయి.
► ఇతర నూనెల దిగుమతులు ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 34,924 టన్నులతో పోలిస్తే 52 శాతం తగ్గి 16,780 టన్నులుగా ఉన్నాయి.  
► ముడి పామాయిల్‌ దిగుమతులు 9,31,180 టన్నులుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇవి 4,77,160 టన్నులుగానే ఉన్నాయి. అంటే రెట్టింపైనట్టు తెలుస్తోంది.
► ఇప్పటి వరకు ఒక నెలలో ముడి పామాయిల్‌ అధిక దిగుమతులు ఇవే కావడం గమనించాలి. చివరిగా 2015 అక్టోబర్‌ నెలలో 8,78,137 టన్నుల ముడి పామాయిల్‌ దిగుమతులు జరిగాయి.  
► రిఫైన్డ్‌ పామోలీన్‌ దిగుమతులు నవంబర్‌ నెలకు 2,02,248 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఉన్న 58,267 టన్నులతో పోలిస్తే మూడు రెట్లకు పైగా డిమాండ్‌ పెరిగింది.
► ముడి సోయాబీన్‌ ఆయిల్‌ దిగుమతులు 2,29,373 టన్నులకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఇవి 4,74,160 టన్నులుగా ఉన్నాయి.

ఎస్‌ఈఏ ఆందోళన..: రిఫైన్డ్‌ పామోలిన్‌ ఆయిల్‌ దిగుమతులు పెరిగిపోవడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఎస్‌ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ముడి పామాయిల్, రిఫైన్డ్‌ ఆయిల్‌ మధ్య టారిఫ్‌ అంతరం 7.5 శాతమే ఉండడంతో, రిఫైన్డ్‌ పామోలీన్‌ దిగుమతులు పెరగడానికి దారితీస్తోంది. తుది ఉత్పత్తుల దిగుమతులు పెరగడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. దేశీ సామర్థ్య వినియోగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రిఫైన్డ్‌ పామోలీన్‌ దిగుమతులు పెరగడానికి.. వాటిని ఎగుమతి చేసే దేశాలు (ఇండోనేషియా, మలేషియా) అక్కడి పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వల్లే.

ముడి పామాయిల్‌ ఎగుమతులపై ఆయా దేశాలు అధిక సుంకాలు విధించాయి. తుది ఉత్పత్తి అయిన పామోలీన్‌ ఆయిల్‌పై తక్కువ డ్యూటీ విధించాయి’’అని అసోసియేషన్‌ పేర్కొంది. దేశీ పరిశ్రమను ఆదుకునేందుకు, ముడి పామాయిల్‌ దిగుమతిని ప్రోత్సహించేందుకు పరిశ్రమ కీలక సూచన చేసింది. రెండింటి మధ్య సుంకాల్లో అంతరం 15 శాతం మేర ఉంచాలని పేర్కొంది. రిఫైన్డ్‌ పామోలీన్‌ ఆయిల్‌పై డ్యూటీని 20 శాతం చేయాలని కోరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వంట నూనెల దిగుమతులు అంతకుమందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 131 లక్షల టన్నుల నుంచి 140 లక్షల టన్నులకు పెరగడం గమనార్హం.

మరిన్ని వార్తలు