అప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ఇప్పుడు ఇండోనేషియా నిషేధం...సామాన్యులపై మరో పిడుగు....!

23 Apr, 2022 17:22 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధిక వంటనూనె ధరలతో సతమతమవుతోన్న సామాన్యులకు ఇప్పుడు ఇండోనేషియా నిర్ణయం కంటిమీద కునుకు లేకుండా చేయనుంది. ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో మరోసారి వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. 

వీపరితమైన కొరత..!
ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారు ఇండోనేషియా.  ఏప్రిల్ 28 నుంచి పామాయిల్‌ ఎగుమతులను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించుకుంది. ఇండోనేషియాలో వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశీయంగా వంటనూనెకు వీపరితమైన కొరత ఏర్పడటంతో పామాయిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతులను నిషేధించేందుకు ఇండోనేషియా సిద్దమైన్నట్లు తెలుస్తోంది. 

భారత్‌, చైనాపై ప్రభావం..!
ఇండోనేషియా నిర్ణయం నేరుగా భారత్‌, చైనాలపై పడనుంది. ఆ దేశం నుంచి పామాయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో చైనా, భారత్‌లు తొలి స్థానంలో ఉన్నాయి. ఇరు దేశాల దిగుమతులు  ప్రపంచ సరఫరాలో సగానికి పైగా ఉంది. ఇండోనేషియా నుంచి పామాయిల్‌ సరఫరా నిలిచిపోవడం వల్ల భారత్‌కు ప్రతి నెలా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  రష్యా ఉక్రెయిన్‌ వార్‌తో ఇప్పటికే భారత్‌లో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ సరఫరా నెలకు దాదాపు లక్ష టన్నులకు సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో వంటనూనె ధరలు వీపరితంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పామాయిల్‌ వాడకం ఎక్కువ..!
పామాయిల్‌ను వంట నూనెల నుంచి ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాస్మొటిక్స్‌, జీవ ఇంధనాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే కూరగాయల నూనె. అంతేకాకుండా బిస్కెట్లు, వనస్పతి, లాండ్రీ డిటర్జెంట్లు, చాక్లెట్ వంటి అనేక ఉత్పత్తుల తయారీలో కూడా పామాయిల్‌ను విరివిరిగా ఉపయోగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి.

చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..!

మరిన్ని వార్తలు