Edible Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌, తగ్గనున్న వంట నూనె ధరలు..ఎప్పటి నుంచంటే..?

18 Jul, 2022 10:15 IST|Sakshi

సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ఆగస్ట్‌ 31 వరకు అన్ని పామాయిల్ ఉత్పత్తులకు ఎగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్‌లో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచ దేశాల్లో ఏ సంక్షోభం తలెత్తినా ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. ఉదాహరణకు..ఉక్రెయిన్‌ నుంచి భారత్‌ 70శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా భారత్‌లో ఆయిల్‌ ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి ముందు రూ.135 నుంచి 150 మధ్యలో ఉన్న వంట నూనె రూ.200కి చేరింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి నూనె రావడం లేదని వ్యాపారస్తులు వాటి ధరల్ని భారీగా పెంచారు.

ధరల్ని తగ్గించాలి
ఈ నేపథ్యంలో కేంద్రం ఆయిల్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిపోతున్న నిత్యవసర ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల‍్పించేలా వెంటనే ఆయిల్‌ ధరల్ని రూ.15 తగ్గించాలని సూచించింది. ఈ తరుణంలో పామాయిల్‌ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఇండోనేషియా రద్దు చేయడంతో..దేశీయ ఆయిల్‌ కంపెనీలు నూనెల ధరల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

వంట నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే!
'విదేశాల నుంచి భారత్‌కు రవాణా అయ్యే సరకు జులై 15 ముందు నుంచే ప్రారంభమవుతుంది. జులై 25కల్లా భారత్‌కు చేరుతుంది. కాబట్టి.. అదే నెలలో (జులై) వంట నూనెల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాతి నెల నుంచి ధరలు తగ్గుతాయని' అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ అన్నారు.  

ఆయిల్‌ ధరల్ని తగ్గించాయి 
భారత్‌లో కొన్ని ఆయిల్‌ కంపెనీలు వాటి ధరల్ని తగ్గించాల్సి ఉంది. అదే సమయంలో అదానీ విల్మార్, మదర్ డెయిరీ, ఇమామి ఆగ్రోటెక్ పాటు ఇతర సంస్థలు గత నెలలో ఆయిల్‌ ఉత్పత్తులపై రూ .10 -15 ధరని తగ్గించాయి.  

మరిన్ని వార్తలు