అమెరికాలో పబ్లిక్‌ ఇష్యూకి బైజూస్‌ !

17 Dec, 2021 20:16 IST|Sakshi

న్యూఢిల్లీ:ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ తాజాగా అమెరికాలో పబ్లిక్‌ ఇష్యూకి సన్నాహాలు చేసుకుంటోంది. దీనికోసం స్పెషల్‌ పర్పస్‌ అక్విజిషన్‌ కంపెనీ (ఎస్‌పీఏసీ) మార్గం ఎంచుకుంటోంది. చర్చిల్‌ క్యాపిటల్‌ సంస్థకు చెందిన ఎస్‌పీఏసీ భాగస్వామ్యంతో చేతులు కలుపుతోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవి తుది దశలో ఉన్నాయని, మరికొద్ది నెలల్లో డీల్‌ కుదరవచ్చని పేర్కొన్నాయి. చర్చలను బట్టి చూస్తే 48 బిలియన్‌ డాలర్ల వ్యాల్యుయేషన్‌తో బైజూస్‌ దాదాపు 4 బిలియన్‌ డాలర్లు సమీకరించే అవకాశం ఉందని వివరించాయి.

అమెరికాలో పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ కోసం ఎస్‌పీఏసీ మార్గం ఎంచుకుంటూ ఉంటాయి. ప్రైవేట్‌ కంపెనీని విలీనం చేసుకునే ఉద్దేశ్యంతో ఏర్పాటయ్యే వీటికి.. ప్రత్యేకంగా కార్యకలాపాలు అంటూ ఏమీ ఉండవు. ఇవి లిస్టెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలుగా ఉపయోగపడుతుంటాయి. విదేశీ ఎక్సే్చంజీల్లో భారతీయ సంస్థలు నేరుగా లిస్టయ్యేందుకు వీలు కల్పించేలా విధానాలను రూపొందించే ప్రక్రియ వేగవంతం చేయాలని స్విగ్గీస్, బైజూస్‌ తదితర స్టార్టప్‌ సంస్థలు కొన్నాళ్ల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీని కూడా విజ్ఞప్తి చేశాయి. బైజూస్‌లో జనరల్‌ అట్లాంటిక్, సెకోయా క్యాపిటల్, చాన్‌–జకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్, నాస్పర్స్, సిల్వర్‌ లేక్, టైగర్‌ గ్లోబల్‌ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.
 

చదవండి: ఐదేళ్లు.. రూ. 94,000 కోట్ల పెట్టుబడులు

మరిన్ని వార్తలు