edtech Startup Udayy: దుకాణం మూసేసిన ఉదయ్‌.. రోడ్డునపడ్డ ఉద్యోగులు

1 Jun, 2022 17:50 IST|Sakshi

కరోనా వైరస్‌ చెలరేగిన సమయంలో ప్రపంచం గజగజ వణికిపోయింది. కానీ ఆ సంక్షోభాన్ని అదనుగా చేసుకుని కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వైరస్‌ ప్రభావం తగ్గిపోయిందనే భావన నెలకొంది. ఫలితంగా కరోనా కష్టాల మీద పుట్టుకొచ్చిన పలు స్టార్టప్‌ల పుట్టి మునిగిపోతుంది. 

కరోనా కారణంగా లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షల కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా స్కూళ్లు , కాలేజీలు నెలల తరబడి మూతపడ్డాయి. అంతేకాకుండా ప్రభుత్వాలే నేరుగా ఆన్‌లైన్‌ క్లాసుల విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ప్రతీ ఇంట ఆన్లైన్‌ క్లాసులు హోరు వినిపించింది. ఇదే సమయంలో ఎడ్‌టెక్ స్టార్టప్‌లు భారీ ఎత్తున మొదలయ్యాయి. బైజూస్‌తో మొదలైన విజయయాత్ర అప్‌గ్రాడ్‌, అన్‌అకాడమీ ఇలా ఉదయ్‌ వరకు కొనసాగింది.

రెండేళ్లలో సీన్‌ రివర్స్‌
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగింది. మరోవైపు కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఫలితంగా జనజీవనం గాడిన పడటం మొదలైంది. ఆన్‌లైన్‌ క్లాసుల స్థానే ఎప్పటిలాగే రెగ్యులర్‌ తరగతులు మొదలయ్యాయి. కేవలం రెండేళ్లలోనే మారిన పరిస్థితుల్లో ఎడ్‌టెక్‌ కంపెనీల పునాదులు కదులుతున్నాయి.

ఎడ్‌టెక్‌లకు గడ్డుకాలం
ఫిజికల్‌ క్లాసులకే మళ్లీ డిమాండ్‌ పెరగడంతో ఎడ్‌టెక్‌ కంపెనీలు వరుసగా నష్టాలను చవి చూస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా ఎడ్‌టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే పనిని వేగంగా చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో స్టార్టప్‌లు 5,600ల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎడ్‌టెక్‌ కంపెనీలు 3600ల మందిని తొలగించాయి. వీటి వాటానే 64 శాతంగా ఉంది.

అస్తమయం
ఉదయ్‌ స్టార్టప్‌ను ఢిల్లీ ఐఐటీ, స్టాన్‌ఫోర్డ్‌ పూర్వ విద్యార్థులు యాదవ్‌, మహేక్‌ గార్గ్‌, కరణ్‌లు 2019 జూన్‌లో ప్రారంభించారు. కరోనా సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ జుమ్మంటూ దూసుకుపోయింది. భారీ ఎత్తున పెట్టుడులు ఆకర్షిస్తూ తారాజువ్వలా దూసుకుపోయింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న నష్టాలను భరించలేక ప్రమోటర్లు చేతులెత్తారు. ఉదయ్‌ను పూర్తిగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఉదయ్‌లో టీచింగ్‌లో ఉన్న వంద మంది ఉద్యోగుల భవిష్యత్తు డోలాయమానంలో పడింది. 

చదవండి: Deepika Padukone: రోడ్డున పడుతున్నాం..దీపికా ఇటు చూడవా!

మరిన్ని వార్తలు