ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించాలి

8 Sep, 2021 21:18 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచే (ఆర్థిక అంశాల పట్ల అవగాహన కల్పించేలా) బాధ్యతను విద్యా సంస్థలు, పరిశ్రమల మండళ్లు, పరిశోధనా సంస్థలు తీసుకోవాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ‘ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీ’ (ఐఈపీఎఫ్‌ఏ) ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో (ఆన్‌లైన్‌ కార్యక్రమం) సింగ్‌ మాట్లాడారు. ఐఈపీఎఫ్‌ఏ బలోపేతానికి కార్పొరేట్‌ శాఖ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.(చదవండి: భారత తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదేనండోయ్‌..!)

ఈ సంస్థ ఇప్పటి వరకు 18,000 క్లెయిమ్‌లను పరిష్కరించింది. షేర్లు, డివిడెండ్‌లు రూ.1,000 కోట్ల విలువ చేసే మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లించింది. చిన్నతనంలోనే ప్రాథమిక ఆర్థిక అంశాలను నేర్పే విదంగా స్కూళ్లు, కళాశాలలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విజ్ఞానం లోపించడం వల్ల చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మోసపూరిత ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్టు చెప్పారు. పొంజి స్కీమ్‌లను నమ్మి ఎంతో మంది మోసపోయినట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు