స్కోర్‌ కొట్టు... లోన్‌ పట్టు!

5 Jun, 2023 04:20 IST|Sakshi

అందరికీ ఒక్కటే వడ్డీ రేటు కాదు...

క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటే చౌకకే

రుణ చరిత్ర బాగా లేకుంటే అధిక రేటు

రుణంపై రేటు ఎలా లెక్కిస్తారో చూడాలి

వేతన జీవులకు ఆకర్షణీయమైన ఆఫర్లు

స్కోరు పెంచుకునే మార్గాలూ ఉన్నాయ్‌

అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే ఏం చేయాలో తోచదు. వైద్యం, ఇంటి మరమ్మతులు, వేతనంలో కోత, ఉద్యోగం కోల్పోవడం, స్కూల్‌ ఫీజు.. అవసరం ఏదైనా వెంటనే డబ్బు కావాల్సి వస్తే.. క్రెడిట్‌ కార్డు నుంచి పరిమితి మేరకు డ్రా చేసుకుని గట్టె్టక్కేస్తుంటారు. ఇది కాకుండా అందుబాటులో ఉన్న మరో మార్గం వ్యక్తిగత రుణం (పర్సనల్‌ లోన్‌). హామీతో పని లేకుండా ఆదాయ వనరు ఉన్న ప్రతి ఒక్కరూ సులభంగా పొందగలిగి రుణం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్న కస్టమర్లకు పర్సనల్‌ లోన్‌ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి.

వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే రుణం మొత్తం చేతికి అందుతుంది. ప్రక్రియ ఎంతో సులభం, అందుకే నేటి రోజుల్లో పర్సనల్‌ లోన్‌ సాధనాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణం అయినా, గృహ రుణం అయినా వడ్డీ రేటు విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కనీసం ఐదారేళ్ల కాలానికి వ్యక్తిగత రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అన్నేళ్లలో వడ్డీ రూపేణా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. వీటిపై అవగాహన కల్పించే కథనమే ఇది.   

వ్యక్తిగత రుణం తీసుకునే వారు ముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రాసెసింగ్‌ ఫీజును పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, వడ్డీ రేటు ఆధారంగా బ్యాంక్‌ను ఖరారు చేసుకోవాలి. ఖాతా ఉన్న బ్యాంకులోనే వ్యక్తిగత రుణం పొందాలనేమీ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే ఇతర బ్యాంకుల ఆఫర్లను అయినా పరిశీలించొచ్చు. అయితే తక్కువ రేటుకు వ్యక్తిగత రుణం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇందులో ముందుగా వ్యక్తిగత క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒకవైపు మన వ్యక్తిగత రుణ చరిత్ర బలంగా ఉండేలా (మెరుగైన స్కోర్‌) చూసుకోవాలి. మరోవైపు తక్కువ రేటుకు వ్యక్తిగత రుణాన్ని ఆఫర్‌ చేసే బ్యాంక్‌లను గుర్తించాలి.

మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారికి బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్నిచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఆ రుణం నమ్మకంగా తిరిగి వస్తుంది. డిఫాల్ట్‌ అవకాశాలు ఉండవు. రిస్క్‌ దాదాపుగా ఉండదు కనుక తక్కువ రేటుకు ఇస్తాయి. ‘‘వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి తనఖా లేదా హామీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. కనుక బ్యాంకులు ఎంత రుణం ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత వడ్డీ రేటుకు ఇవ్వాలనే అంశాలను నిర్ణయించే విషయంలో రుణ గ్రహీత క్రెడిట్‌ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్‌ స్కోరు ఉన్న వారు వడ్డీ రేటు తగ్గించాలంటూ బ్యాంకులను డిమాండ్‌ చేయవచ్చు’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్‌ కుమార్‌ సూచించారు. (పెళ్లికొడుకు లుక్‌లో జబర్‌దస్త్‌గా..మస్క్‌: ఫోటోలు వైరల్‌)

  క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ను ఉపయోగించుకునే వారు సకాలంలో బిల్లులను చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్‌ కాకూడదు. అలాగే, రుణం ఏదైనా కానీయండి ఈఎంఐల చెల్లింపుల విషయంలో బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాలి. వీలుంటే ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరిగే ఆప్షన్‌ నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తుంటే, అప్పటికే ఉన్న ఇతర రుణాలను తీర్చివేయడం వల్ల కూడా క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. ‘‘మీ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగ చరిత్ర చాలా సాఫీగా ఉండాలి. క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు చెల్లింపులను కొన్ని రోజులు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకటి రెండు సార్లు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, అది క్రెడిట్‌ చరిత్రలో మచ్చగా చేరొచ్చు.

అప్పుడు రుణాలిచ్చే సంస్థలు దీన్ని రిస్క్‌గా భావిస్తాయి. రుణ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది’’ అని ఇన్‌క్రెడ్‌ రిస్క్‌ అండ్‌ అనలైటిక్స్‌ ప్రెసిడెంట్‌ పృథ్వీ చంద్రశేఖర్‌ తెలిపారు. అవగాహన లేక క్రెడిట్‌ కార్డ్, వాహన, ఇతర రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం చోటుచేసుకుంటే అది భవిష్యత్తులో వారు తీసుకోబోయే రుణాలపై అధిక రేట్లకు దారితీస్తుందని గమనించాలి. అందుకే బ్యాంక్‌లు రుణ చరిత్రలో మచ్చలు ఉండి, రిస్క్‌ ఖాతాలుగా భావిస్తే అటువంటి వారికి సాధారణం కంటే అధిక వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఎలాంటి వైఫల్యం లేని, మెరుగైన రుణ చరిత్ర ఉన్న వారికి తక్కువ రేటుకు ఆఫర్‌ చేస్తాయి.  

ఆఫర్లు..
వ్యక్తిగత రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల ఆఫర్లను, రుణ రేట్లు, నియమ, నిబంధనలు, షరతులు అన్నీ చూడాలి. ఆ తర్వాతే ఆకర్షణీయమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలి. ముందుగా వేతన ఖాతా, డిపాజిట్లు ఉన్న బ్యాంకును అడిగి చూడాలి. ఆ తర్వాత వివిధ బ్యాంకుల రుణ రేట్లు, ఇతర ఆఫర్ల సమాచారం పొందొచ్చు. సాధారణంగా బ్యాంకుల వెబ్‌సైట్లో వ్యక్తిగత రుణాలపై ఫిక్స్‌డ్‌ రేటు ప్రదర్శించరు. కనిష్టం నుంచి గరిష్టం రేటును ప్రదర్శిస్తాయి. మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి అందులో కనిష్ట రేటుకే రుణం లభించే అవకాశాలున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

‘‘రుణ గ్రహీత క్రెడిట్‌ స్కోరు ఒక్కటే కాకుండా, కోరుకుంటున్న రుణం మొత్తం, లోన్‌ టు వ్యాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, ఉద్యోగ స్వరూపం, ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని పైసా బజార్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సని అరోరా తెలిపారు. కొన్ని బ్యాంకులు పండుగలు, ఇతర సమయాల్లో ప్రత్యేక రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ, వడ్డీ రేటుపై రాయితీలు ఇస్తుంటాయి. కనుక వాటిని పరిశీలించొచ్చు. వీలైనన్ని రుణ సంస్థల మధ్య వ్యక్తిగత రుణ ఆఫర్లను పోల్చుకోవాలని అరోరా సూచించారు. ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు కార్పొరేట్‌ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి.   (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు)

మార్గాలు..
రుణ చెల్లింపులు సకాలంలో చేయడం వల్ల క్రెడిట్‌ స్కోరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుణ వినియోగ రేషియో కూడా క్రెడిట్‌ స్కోరు లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న రుణం పరిమితిలో ఎంత వినియోగించుకున్నారనేది. రుణంపై మీరు ఏ మేరకు ఆధారపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. క్రెడిట్‌ యూసేజ్‌ రేషియో 30 శాతం లోపు కొనసాగించాలి. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డుపై రూ.1 లక్ష క్రెడిట్‌ లిమిట్‌ ఉందని అనుకుందాం. అప్పుడు మీ వినియోగం రూ.30 వేల వరకు ఉండాలి.

ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకే సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేస్తుండడం కూ డా క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభా వం చూపి స్తుంది. అందుకే ఒకేసారి వెంటవెంట ఒక టికి మించిన క్రెడిట్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవద్దు. అంతేకాదు ఒకటికి మించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద వ్యక్తిగత రుణానికి అభ్యర్థనలు ఇవ్వొ ద్దు. దీనివల్ల ఏకకాలంలో ఒకటికి మించిన క్రెడిట్‌ అ భ్యర్థనల సమాచారం క్రెడిట్‌ బ్యూరోలకు చేరుతుంది. అది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్‌, నెట్‌వర్త్‌ గురించి తెలుసా?)

వేతన ఖాతా..
 ఉద్యోగులకు పర్సనల్‌ లోన్‌ విషయంలో బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తీసుకోవడం అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ వేతన జమ, మీ ఖర్చులు, ఉపసంహరణ వివరాలు ఖాతాలో నమోదై ఉంటాయి. కనుక రుణానికి ముందు బ్యాంక్‌ అధికారి వాటిని చూసి ఓ అంచనాకు రాగలరు. అందుకే వేతన ఖాతాలున్న వారికి ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ను చాలా బ్యాంకులు డిజిటల్‌గా ఆఫర్‌ చేస్తుంటాయి.

బ్యాంకు సిబ్బందితో మాట్లాడి తక్కువ రేటుకు రుణం పొందొచ్చు. ‘‘బ్యాంకులు సాధారణంగా తమ ఖాతాదారులకు సంబంధించి నియమ నిబంధనలు, షరతుల విషయంలో కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. అంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు తగ్గించడం, వేగంగా మంజూరు చేస్తాయి. సంబంధిత ఖాతాదారుకు సంబంధించి వేతనం, ఇతర వ్యయాల సమాచారం అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేయగలవు’’అని అప్నా పైసా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ వీ స్వామినాథన్‌ పేర్కొన్నారు.   

ఇతర చార్జీలనూ చూడాలి..
వ్యక్తిగత రుణంలో ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్‌టీ, ఇతర చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, ముందుగా తీర్చేస్తే పడే చార్జీలు తెలుసుకుని నిర్ణయానికి రావాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్‌ ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు రుణం మొత్తంపై 1–3 శాతం మధ్య ప్రాసెసింగ్‌ ఫీజు విధిస్తున్నాయి. రుణం ముందుగా చెల్లిస్తే విధించే చార్జీలు కూడా బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ముందుగా తీర్చివేసే ఉద్దేశం ఉందా అని చూడాలి.

వడ్డీ రేటుపై అవగాహన...
తక్కువ రేటుపై వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా.. రుణం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే చెల్లిస్తుంటారు. ముందుగా బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తాయన్నది తెలుసుకోవాలి. ఫ్లాట్‌ రేటు, లేదా తగ్గింపు రేటును బ్యాంకులు ఆఫర్‌ చేయొచ్చు. ఫ్లాట్‌ వడ్డీ రేటు అయితే రుణం కాల వ్యవధి అంతటా అసలు మొత్తం (ప్రిన్సిపల్‌)పైనే వడ్డీ రేటు అమలవుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారనుకోండి. మొత్తం మీద రూ.1,80,000ను వడ్డీ కింద చెల్లించాలి.

నెలవారీ ఈఎంఐ రూ.18,889 అవుతుంది. అదే తగ్గింపు వడ్డీ రేటు విధానంలో.. ప్రతీ వాయిదాకు ముందు మిగిలిన ఉన్న బకాయిపైనే వడ్డీ రేటును బ్యాంకులు లెక్కిస్తాయి. రూ. 5 లక్షల రుణాన్ని తగ్గింపు రేటు విధానంలో 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మూడేళ్లలో వడ్డీ రూపేణా రూ.97,858 చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.16,607 అవుతుంది. దీంతో మొత్తం మీద ఈ విధానం వల్ల రూ.82,142 ఆదా అవుతుంది. అందుకే రెడ్యూసింగ్‌ ఇంటరెస్ట్‌ రేట్‌ విధానంలోనే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. పర్సనల్‌ లోన్‌పై తక్కువ రేటుకు ఇస్తామంటే బుట్టలో పడిపోకుండా.. రుణంపై వడ్డీ రేటును నెలవారీ ఎలా లెక్కిస్తారో అడిగి స్పష్టత తెచ్చుకోవాలి. 

మరిన్ని వార్తలు