ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం.. ఈజిప్టులో తిండికి కటకట.. భారత్‌వైపు చూపు!

30 Mar, 2022 10:55 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. యుద్ధంతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సప్లై చైన్‌ ఇక్కట్లలో పడటంతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇందులో మిడిల్‌ ఈస్ట్‌కి చెందిన ఈజిప్టు కూడా చేరింది. 

80 శాతం దిగుమతులే
ఈజిప్షియన్ల ప్రధాన ఆహారం గోధుమలు. తమ దేశంలో వినియోగించే గోదుమల్లో దాదాపు 80 శాతాన్ని ఈజిప్టు దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం ఇంత కాలం ఉక్రెయిన్‌, రష్యా దేశాలపై ఎక్కువగా ఈజిప్టు ఆధారపడింది. అయితే 2021 నవంబరు నుంచి ఉక్రెయిన్‌ , రష్యాల మధ్య ఉద్రిక్తలు నెలకొని ఉండటంతో గోదుమల దిగుమతి తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్‌ 2022 ఆరంభంలోనే కనిపించింది.  

పెరిగిన ధరలు
ఫిబ్రవరి నెల గణాంకాలను పరిశీలిస్తే గతేడాదితో పోల్చితే ఆహార ధాన్యాల ధరలను 4.6 శాతం పెరిగాయి. ఇక ఫిబ్రవరిలో ఆహార ధాన్యాలకు సంబంధించి ద్రవ్యోల్బణం 7.2 శాతంగా నమోదు అవగా జనవరిలో అది 6.3 శాతంగా ఉంది. దీంతో ఫిబ్రవరిలోనే ఈజిప్ట్‌ మార్కెట్‌లో బ్రెడ్‌ ధర ఏకంగా 25 శాతం పెరిగింది.

తొలగని అనిశ్చితి
ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌, రష్యాల మధ్య మొదలైన యుద్ధం నెలరోజులు గడిచినా కొలిక్కి రాలేదు. ఇంకా ఎంత కాలం యుద్ధం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ యుద్ధం ముగిసినా రష్యా, ఉక్రెయిన్‌లలో తిండి గింజలను గతంలోలా ఎగుమతి చేస్తారో లేదో తెలియదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఈజిప్టు దృష్టి పెట్టింది.

భారత్‌ సాయం
ప్రపంచంలో గోదుమలు అధికంగా పండించే దేశాలలో భారత్‌ ఒకటి. దీంతో తమ ఆహార ధాన్యాల అవసరాల కోసం ఇండియాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఈజిప్టుకు నెలకొంది. దీంతో ఇటీవల దుబాయ్‌లో జరిగిన సమావేశంలో మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో ఈజిప్టు ప్లానింగ్‌ శాఖ మంత్రి హలా ఎల్సైడ్‌ చర్చించారు. 

మొదలైన కసరత్తు
తమ దేశ అవసరాలకు సరిపడే విధంగా కోటి 20 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేయాలంటూ ఈజిప్టు భారత్‌ని కోరింది. భారీ ఎత్తున జరిగే గోదుమల వాణిజ్యానికి తగ్గట్టుగా లాజిస్టిక్స్‌, సప్లై చెయిన్‌ వంటి కీలక అంశాలపై ఇరువైపులా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

చదవండి: ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం, భారత్‌ ఎకానమీపై భారీ ఎఫెక్ట్‌..ఎంతలా ఉందంటే!

మరిన్ని వార్తలు