‘బేస్‌’ మాయలో ఏప్రిల్‌ మౌలిక రంగం

1 Jun, 2021 02:21 IST|Sakshi

ఏకంగా 56 శాతం అప్‌

న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌పై ఏప్రిల్‌లో పూర్తి ‘లో బేస్‌ ఎఫెక్ట్‌’ పడింది. ఏకంగా 56.1 శాతం పురోగతి నమోదయ్యింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పు ను ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఇక్కడ 2020 ఏప్రిల్‌ను తీసుకుంటే, ఎనిమిది రంగాల గ్రూప్‌లో కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా 37.9% క్షీణత నమోదయ్యింది. సమీక్షా కాలంలో కీలక రంగాలను వేర్వేరుగా సమీక్షిస్తే...

► సహజ వాయువు:  19.9 శాతం క్షీణత నుంచి 25 శాతం పురోగతికి మారింది.
► రిఫైనరీ ప్రొడక్టులు: 24.2 శాతం క్షీణ రేటు నుంచి 30.9 శాతం వృద్ధికి చేరింది.
► స్టీల్‌: 82.8 శాతం మైనస్‌ నుంచి 400 శాతం వృద్ధికి హైజంప్‌ చేసింది.
► సిమెంట్‌: 85.2 శాతం క్షీణ రేటు నుంచి 548.8 శాతం పురోగమించింది
► విద్యుత్‌: 22.9 శాతం నష్టం నుంచి 38.7 శాతం వృద్ధితో యూటర్న్‌ తీసుకుంది.  
► బొగ్గు: 9.5 శాతం పురోగమించింది.
► ఎరువులు: స్వల్పంగా 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.  
► క్రూడ్‌ ఆయిల్‌:  క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఏప్రిల్‌లోనూ  దిగజారింది. 2.1% క్షీణతనే నమోదుచేసుకుంది. అయితే 2020 ఏప్రిల్‌ నాటి మైనస్‌ 6.4% క్షీణత రేటు కొంత తగ్గడం కొంత ఊరట.
 

ఐఐపీ 150% పెరిగే చాన్స్‌!
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్‌ 40.27 శాతం. ఏప్రిల్‌ ఐఐపీ గణాంకాలు మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉంది. భారీ బేస్‌ ఎఫెక్ట్‌ వల్ల ఐఐపీ పెరుగుదలసైతం 130 నుంచి 150 శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– అదితి నాయర్, ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌ 

మరిన్ని వార్తలు