వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్‌కాయిన్‌ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..!

21 Nov, 2021 13:56 IST|Sakshi

El Salvador Plans to Build the World's First Bitcoin City: త్వరలో ప్రపంచంలోనే  'బిట్‌ కాయిన్‌ సిటీ' నిర్మాణం జరగనుంది. ఇందు కోసం నిర్వాహకులు బిట్‌ కాయిన్‌ బాండ్ల ద్వారా నిధులు సేకరించనున్నారు. ఇప్పటికే పలు దేశాలు బిట్‌ కాయిన్‌ను చట్టబద్ధత చేసే దిశగా అడుగులు వేస్తుండగా.. ఈ దేశం మాత్రం ఏకంగా బిట్‌కాయిన్‌ సిటీని నిర్మించడంపై మార్కెట్‌ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచంలోనే తొలిసారి సెంట్రల్‌ అమెరికాకు చెందిన ఎల్‌ శాల్వడార్‌ దేశం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్‌ శాల్వడార్‌ దేశం బిట్‌ కాయిన్‌ అంశంలో మరో అడుగు ముందుకేసింది. ఎల్‌ శాల్వడార్‌  ప్రపంచంలోని మొట్టమొదటి 'బిట్‌కాయిన్ సిటీ'ని నిర్మించాలని యోచిస్తోంది. దీనికి ప్రారంభంలో బిట్‌కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సమకూరుతాయని ఎల్‌ శాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్ బుకెలే చెప్పారు.

ఎల్ సాల్వడార్‌ దేశంలో బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించే దిశగా అధ్యక్షుడు నయీబ్ బుకెలే కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ అవెర్నెస్‌ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో ముగియనున్న సందర్భంగా ఎల్‌ శాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిట్‌ కాయిన్ ల కోసం అగ్నిపర‍్వతం నుంచి ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని, త్వరలోనే ఈ ప్రాంతంలో బిట్‌ కాయిన్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సిటీలో  విలువ ఆధారిత పన్ను (VAT) మినహా ఎలాంటి పన్నులను ప్రభుత్వం విధించదని చెప్పారు.  'ఈ బిట్‌ కాయిన్‌ సిటీని కోసం 2022లో నిధులు సమకూర్చడం ప్రారంభిస్తామని, 2022లో బాండ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

బుకెల్‌తో పాటు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రొవైడర్ బ్లాక్‌స్ట్రీమ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శాంసన్ మోవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్ శాల్వడార్ దేశంలో బిట్‌ కాయిన్‌ సిటీని ఏర్పాటు చేసేందుకు  బిట్‌కాయిన్ మద్దతుతో $1 బిలియన్ బాండ్‌ను జారీ చేస్తుందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు