ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం

9 Nov, 2020 05:44 IST|Sakshi

ప్రభావం చూపనున్న బిహార్‌ ఎన్నికల ఫలితాలు 

పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలూ కీలకమే 

మార్కెట్‌ పెరిగితే కొత్త రికార్డ్‌లకు సూచీలు  

బిహార్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు.  

చివరి దశకు క్యూ2 ఫలితాలు....
మూడు దశల్లో జరిగిన బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్‌ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్,  ఓఎన్‌జీసీ, హిందాల్కో, హిందుస్తాన్‌ కాపర్, ఐడీఎఫ్‌సీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆయిల్‌ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్‌ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్‌ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి.  

కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు...!
ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్‌కు ప్రతికూలాంశమని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విశ్లేషకులు హేమాంగ్‌ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్‌ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్‌ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.  

ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్‌ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్‌ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్‌ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్‌ఎస్‌సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ  ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని
వారంటున్నారు.  

అక్టోబర్‌లో ఈక్విటీల నుంచి ఫండ్స్‌ భారీ ఉపసంహరణలు...
వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేశాయి. అక్టోబర్‌ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్‌ నుంచి ఎంఎఫ్‌లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్‌ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్‌ను విక్రయించడమే విత్‌డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్‌లు స్టాక్‌ మార్కెట్‌లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది.

అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్‌ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా మారుతుండటంతో ఇన్‌ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్‌ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.7,200 కోట్ల ఔట్‌ఫ్లో ఉందని, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) నుంచి ఔట్‌ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘

‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్‌ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఓఓ హర్‌‡్ష జైన్‌ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్‌లు విత్‌డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్‌లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్‌ పతనం తర్వాత ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్‌ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్‌ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్‌ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ నీలేష్‌ శెట్టి తెలిపారు.

మరిన్ని వార్తలు