-

జుట్టు తెల్లబడుతుందా నోటెన్షన్, అదిరిపోయే గాడ్జెట్‌ మీకోసం!

8 May, 2022 17:10 IST|Sakshi

 నల్లటి, పట్టులాంటి జుట్టే ఎవ్వరికైనా ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ముఖానికి కళనిచ్చే కేశాలు వయసుతో సంబంధం లేకుండా తెల్లబడిపోతున్నాయి. పోషకాహార లోపమో.. కాలుష్య ప్రభావమో.. బాలమెరుపు అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. 

వయసు మీద పడినా నల్లటి జుట్టునే కోరుకునేవారు కొందరైతే, బాలమెరుపు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు ఇంకొందరు. అందరికీ ఒక్కటే దిక్కు.. అయితే కలర్‌ వేసుకోవాలి. లేదంటే హెన్నా పెట్టుకోవాలి. హెన్నా అనగానే రెండు రోజుల పని. ముందు రోజు కలిపి నానబెట్టుకోవాలి. తెల్లవారి అప్లయ్‌ చేసుకుని ఓ రెండుమూడు గంటలు ఉండాలి. అంత టైమ్‌ ఎక్కడుందీ బిజీ కాలంలో.  అందుకే ఎక్కువ మంది కలర్‌ వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. వీళ్లందరితో పాటు.. స్టయిలిష్‌ లుక్‌ కోసం రకరకాల రంగులు వేసుకునేవారికి సైతం చక్కగా సహకరిస్తుంది ఈ దువ్వెన (ఎలక్ట్రిక్‌ హెయిర్‌ డైయింగ్‌ కూంబ్‌).

సొంత ప్రయోగాలు ఎందుకులే అంటూ పార్లర్లు, సెలూన్లకు తిరుగుతూ డబ్బులు వృథా చేసుకునేవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. ఈ డివైజ్‌ ఇంట్లో ఉంటే.. వేగంగా, సురక్షితంగా ఒంటి చేత్తో  డై వేసుకోవచ్చు. ఇది బ్యాటరీల సాయంతో పనిచే స్తుంది. దువ్వెన పళ్లు ఉన్నవైపు మధ్యలో గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని ఓపెన్‌ చేసి.. అందులో కలర్‌ నింపుకుని.. తిరిగి మూత పెట్టి, గట్టిగా బిగించి, ముందువైపు కింద భాగంలో ఉన్న బటన్‌ ఆన్‌ చేసుకుని, సాధారణంగా జుట్టు దువ్వుకున్నట్లు దువ్వుకుంటే సరిపోతుంది. దువ్వెన పళ్లలోంచి కొద్దికొద్దిగా లిక్విడ్‌ బయటికి వస్తూ ప్రతి వెంట్రుకకు కలర్‌ వేస్తుంది. అయితే కలర్‌ వేసుకునే కంటే ముందు జుట్టును చిక్కు లేకుండా చూసుకోవాలి. మార్కెట్‌లో ఇలాంటి మోడల్స్‌ చాలానే దొరుకుతున్నాయి. అయితే ఇతర వినియోగదారుల రివ్యూస్, క్వాలిటీ చూసుకుని కొనుగోలు చేయడం మంచిది. 

మరిన్ని వార్తలు