Electric Scooters: జూన్‌ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలు

31 May, 2023 10:48 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, బైక్‌ల ధరలు జూన్‌ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్‌ 2 (FAME-II) (ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) పథకం కింద అందించే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. 2023 జూన్ 1 ఆ తర్వాత కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అంటే జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, బైక్‌ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. 

గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ప్రతి కొలో వాట్‌-అవర్‌ (kWh)కి రూ. 10,000 మాత్రమే ఉంటుంది. అది కూడా వాహనాల ఎక్స్-షోరూం ధరలో గరిష్టంగా 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇది గతంలో 40 శాతం ఉండేది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీలు జూన్ 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.  అయితే తమ ద్విచక్ర వాహనాల ధరలు రూ.32,500 వరకు పెరుగుతాయని ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ తెలిపింది. 

ఇదిలా ఉండగా, పరిశ్రమలు సబ్సిడీ లేకుండా జీవించడం నేర్చుకోవాలని ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా అన్నారు. 2019లో రూ.30,000 ఉన్న సబ్సిడీ 2021లో రూ.60,000కి పెరిగిందని, ఇప్పుడు రూ.22,000 తగ్గిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి ఫేమ్‌ (FAME) (ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో మూడేళ్ల కాలానికి దీన్ని ప్రకటించినా తర్వాత 2024 మార్చి 31 వరకు మరో రెండేళ్ల కాలానికి పొడిగించింది.

ఇదీ చదవండి: Heavy Electric Scooter: ఈ ఎలక్ట్రిక్‌ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు!

మరిన్ని వార్తలు