ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి షాక్.. పెరగనున్న ఈవీ ధరలు!

31 Mar, 2022 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ: మీరు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. ఉక్రెయిన్ సంక్షోభంతో తలెత్తిన సరఫరా అంతరాయాల మధ్య దిగుమతి చేసుకున్న బ్యాటరీల వల్ల కలిగిన నష్టాలను తగ్గించుకోవడానికి దేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీకంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. 2021లో బ్యాటరీ సెల్స్ సగటు ఖర్చు కిలోవాట్-గంటకు(కెడబ్ల్యుహెచ్) సుమారు $ 101 లేదా సుమారు ₹7,670/ కిలోవాట్'గా ఉంది. 

₹5,500 పెంచిన అథర్ ఎనర్జీ
అయితే, ప్రస్తుతం ఈవి బ్యాటరీ సెల్స్ ధర 130 డాలర్లు లేదా అంతకంటే పైగా పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమెన్ మండల్ అన్నారు. సరఫరా అంతరాయాలు, అంతర్జాతీయ కారణాల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఓలా ఎస్1 స్కూటర్​లో 2.98 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటే, ఏథర్ 450ఎక్స్'లో 2.61 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకంపెనీ అథర్ ఎనర్జీ ఇప్పటికే తన 450ఎక్స్ స్కూటర్ ధరలను జనవరిలో 3శాతం లేదా ₹5,500 కంటే కొంచెం ఎక్కువ పెంచింది. ఆ సమయంలో ఇన్ పుట్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. 

ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ మార్చి 17న ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించారు. ఓలా ఎస్ 1 ప్రో ధర ప్రస్తుతం ₹1,29,999. అయితే, ఓలా ఎలక్ట్రిక్, వచ్చే నెలలో మళ్లీ అమ్మకానికి వచ్చినప్పుడు స్కూటర్ కొత్త ధర ఎలా ఉంటుందో ఇంకా ప్రకటించలేదు. "బ్యాటరీ సెల్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు ప్రపంచ ఘర్షణలు, వాణిజ్య ఆంక్షల కారణంగా పెరిగాయి. దీంతో చైనా, కొరియా & తైవాన్ వంటి ప్రధాన సెల్-తయారీ దేశాలలో బ్యాటరీ సెల్ ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. బ్యాటరీ సెల్ ధరలు పెరగడంతో, భారతదేశం బ్యాటరీ తయారీదారులు చెల్లించే దిగుమతి ఖర్చులు కూడా పెరిగాయి. గత రెండు నెలల్లో, సెల్ ధరలు దాదాపు 30% పెరిగాయి" అని గ్రేటర్ నోయిడాకు చెందిన బ్యాటరీ తయారీదారు లోహమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ వర్మ చెప్పారు.

(చదవండి: నాటో, తూర్పు ఐరోపా దేశాలపై పరోక్ష దాడులకు దిగిన రష్యా..!)

మరిన్ని వార్తలు