ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌తో చిన్న సంస్థలకు భారీ అవకాశాలు

22 Dec, 2021 07:52 IST|Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తరణతో చిన్న సంస్థలు, కొత్తగా ఇటువైపు అడుగుల వేసే కంపెనీలకు, స్టార్టప్‌లకు భారీ అవకాశాలు వచ్చిపడతాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తాజా నివేదిక ఒకటి పేర్కొంది.

వాహన రంగంలో ఎలక్ట్రిఫికేషన్‌ (ఈవీకి మారడం) వేగం తీరు, పోటీ వాతావరణంపై అచ్చమైన ఈవీ కంపెనీల వ్యాల్యూషన్‌ ఆధారపడి ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్యాసింజర్‌ వాహనాల విభాగం వేగంగా ఈవీలకు మళ్లుతోందని కనుక.. అచ్చమైన ఈ–ప్యాసింజర్‌ కంపెనీలకు అధిక విలువ దక్కుతున్నట్టు విశ్లేషించింది. మధ్య తరహా, భారీ వాణిజ్య వాహన విభాగంలో ఎలక్ట్రిఫికేషన్‌ నిదానంగా ఉందని.. చిన్నపాటి వాణిజ్య వాహనాల్లో ఇది వేగంగా ఉన్నట్టు వివరించింది. 2026–27 నాటికి ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా 15 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. స్కూటర్ల విభాగంలో ఈవీల వాటా ఇప్పటికే 35 శాతానికి చేరినట్టు వివరించింది. 2020–21 నాటికి ద్విచక్ర ఈవీల వాటా 1శాతంగానే ఉంది. ప్రభుత్వ సబ్సిడీలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది.

ప్యాసింజర్‌ వాహనాల ఎలక్ట్రిఫికేషన్‌ చాలా నిదానంగా ఉందని, ఫేమ్‌–2 పథకం కింద సబ్సిడీల్లేకపోవడం (వ్యక్తిగత వినియోగానికి), చార్జింగ్‌ సదుపాయాలు తక్కువగా ఉండడం ఇందుకు కారణంగా తెలిపింది. ‘‘ఎలక్ట్రిఫికేషన్‌తో సంప్రదాయ స్కూటర్ల విభాగానికి ముప్పు ఎక్కువగా ఉంది. దేశీ త్రిచక్ర వాహన విభాగంలో ఈవీ వాటా 2026–27 నాటికి 19 శాతానికి చేరొచ్చు. వాణిజ్య వాహనాల వాటా 23 శాతానికి, చిన్న పాటి వాణిజ్య వాహనాలు 18 శాతానికి చేరుకోవచ్చు’’ అని వివరించింది.  

ఆరంభంలోనే.. 
ఎలక్ట్రిక్‌ వాహన వినియోగంలో భారత్‌ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక తెలియజేసింది. ఎలక్ట్రిఫికేషన్‌ రిస్క్‌ దృష్ట్యా ద్విచక్ర వాహన స్టాక్స్‌కు డీరేటింగ్‌ ముప్పు ఉన్నట్టు తెలిపింది. ఈవీ వ్యాపారానికి సంబంధించి నిధులు సమీకరించిన కంపెనీలకు ఇప్పటికే మార్కెట్‌ మెరుగైన వ్యాల్యూషన్‌ ఇచ్చినట్టు పేర్కొంది. ఈవీల్లోకి అడుగుపెట్టిన ఓరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులకు (ఓఈఎం) సంబంధించి విలువ ఇంకా వెలుగుచూడాల్సి ఉందని తెలిపింది.  

చదవండి: మరోసారి తెరపైకి టాటా - ఎయిరిండియా డీల్‌..!

మరిన్ని వార్తలు