Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనకొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌..!

25 Dec, 2021 15:05 IST|Sakshi

మీరు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలుచేయాలని చూస్తున్నారా..! అయితే వెంటనే కొనేయండి..అది కూడా 2021లో కొంటేనే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు భారీగా అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సంప్రాదాయ వాహనాలతో పాటుగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ధరలు అమాంతం పెరిగేలా కన్పిస్తోంది. 

చిప్స్‌ తెచ్చిన చిచ్చు...!
కరోనా-19 రాకతో ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా పరిశ్రమల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా ఉదృతి ​కాస్త నెమ్మదించడంతో పరిశ్రమలు మళ్లీ తిరిగి మొదలయ్యాయి. కరోనా-19 ముఖ్యంగా ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ కంపెనీలకు భారీ దెబ్బ తగిలింది. చిప్స్‌ కొరత భారత కంపెనీలపై కూడా పడింది.  సెమికండక్టర్స్‌ (చిప్స్‌) కొరతతో ఉత్పత్తి రేటు పడిపోయింది. డిమాండ్‌-సప్లైకు అనువుగా ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అధిక ద్రవ్యోల్భణం, ముడి సరుకుల ధరలు అధికమవ్వడంతో ధరలు పెంపు అనివార్యమైందని ఆయా ఆటోమొబైల్‌ కంపెనీలు వెల్లడించాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. వీటితో పాటుగా వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు భారీగా  పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.  

ధరల పెరుగుదలకు కారణాలు ఇవే..! 
ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు చిప్స్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటితో పాటుగా ఆయా తయారీ సంస్థలకు బ్యాటరీల తయారీ కూడా పెను సవాలుగా మారినట్లు తెలుస్తోంది.  లిథియం-అయాన్‌ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్యాటరీల తయారీలో వాడే ప్రధాన లోహాలైన లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైయిన్‌  రంగాల్లోని సమస్యలు కూడా ఈవీ వాహనాల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.

2021 ప్రారంభం నుంచి..!
2021 ప్రారంభం నుంచి ప్రతి త్రైమాసికంలో బ్యాటరీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఒక ‘సెల్‌’ల ధర గరిష్టంగా 30 శాతం పెరిగింది. బ్యాటరీల తయారీకయ్యే ఖర్చులో 70 శాతం సెల్స్‌ కోసమే. ప్రపంచవ్యాప్తంగా ఆయా బ్యాటరీలకు వాడే ముడి పదార్థాలను కాంగో నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనా రాకతో అక్కడి గనుల్లో కార్యకలాపాలు నెమ్మదించాయి. దీంతో 2022లో ఒక్క కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ధర 2.3 శాతం పెరిగి 135 డాలర్ల(సుమారు ధర రూ. 10,000పైగా )కు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆయా కంపెనీలు బ్యాటరీ కొరత కారణంగా రీసైక్లింగ్‌పై దృష్టిసారించాయి. ఇది కాస్తమేరకు ఊపశమనం కల్పించేలా కన్పిస్తున్నాయి. 

ధరల పెరుగుదల అనివార్యం..!
వచ్చే  ఏడాది నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని గతంలో ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం స్టెల్లాంటిస్ ఎన్.వి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్లోస్ టావరెస్ ఎలక్ట్రిక్ వాహన రంగంపై రాయిటర్స్ నెక్ట్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఆటోమేకర్లపై పడుతున్న బాహ్య ఒత్తిడి వల్ల భవిష్యత్ లో ఈవీ వాహనాల ధరలు పెరగడంతో పాటు, ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా  కంపెనీలకు పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి 50 శాతం అధిక ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో కచ్చితంగా పెరిగిన ఖర్చు ఎలక్ట్రిక్‌ వాహనాల ధరల పెంపుకు అనివార్యమని అన్నారు. 

చదవండి: కోవిడ్‌ ఎఫెక్ట్‌, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలు

మరిన్ని వార్తలు