సరళతర విధానాలను వెనక్కుతీసుకోలేం!

19 Dec, 2020 05:47 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

డిసెంబర్‌ 2–4 తేదీల మధ్య జరిగిన విధాన సమీక్ష మినిట్స్‌ విడుదల  

ముంబై: కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి గడచిన తొమ్మిది నెలలుగా తీసుకున్న లిక్విడిటీ (వ్యవస్థలో ద్రవ్య లభ్యత) తదితర సరళతర ద్రవ్య విధానాలను ఇప్పుడే వెనక్కు తీసుకోలేమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ఫలితం లభించకపోగా, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న రికవరీ, వృద్ధి ధోరణులకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు.

డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 4వ తేదీవరకూ మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక సమావేశాల మినిట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి. దీనిప్రకారం, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గించనప్పటికీ, వృద్ధికి దోహపడే అన్ని చర్యలనూ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. క్యూ3, క్యూ4   కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని  అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది.

రెపో రేటు తగ్గించడం కష్టమే: నోమురా
కాగా, కీలక రెపో రేటు 2021లోనూ తగ్గించడం కష్టమని జపాన్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం– నోమురా శుక్రవారంనాటి తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ తీవ్రంగా ఉందని పేర్కొన్న నోమురా, ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పైగా ద్రవ్యోల్బణం సమీప కాలంలో పెరిగే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషించింది. ఇదే జరిగితే, 2022లో వడ్డీరేట్ల పెంపునకే ఆర్‌బీఐ పాలసీ కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అక్టోబర్‌లో 7.6 శాతం ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 6.93 శాతానికి తగ్గింది. అయితే ఇది కూడా ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి కన్నా అధికం కావడం గమనార్హం. దీనిప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలి.

పీఎమ్‌సీ బ్యాంకులో పెట్టుబడులకు నాలుగు ఆఫర్లు
 పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎమ్‌సీ బ్యాంకు)లో పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకుపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించింది. బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎమ్‌సీ బ్యాంకులో 2019 సెప్టెంబర్‌లో స్కామ్‌ వెలుగులోకి రావడంతో ఆర్‌బీఐ పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకు పునర్‌నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణలను గత నెలలో ఆహ్వానించగా.. నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నట్టు ఆర్‌బీఐకి పీఎమ్‌సీ బ్యాంకు సమాచారం ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్‌బీఐ బోర్డ్‌
ఆర్‌బీఐ 586వ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం శుక్రవారం నాడు ముంబైలో జరిగింది. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, భారత్‌పై దీని ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై ఉద్దీపన, ద్రవ్య పరపతి విధాన చర్యల ఫలితాలపై గవర్నర్‌ నేతృత్వంలోని జరిగిన ఈ సమావేశం దృష్టి సారించింది. 2019–20లో భారత్‌ బ్యాంకింగ్‌ ధోరణి, పురోగతిపై ఒక ముసాయిదా నివేదికను కూడా చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్, ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిస్‌ పాండా, డిప్యూటీ గవర్నర్లతోపాటు బోర్డ్‌ డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు