థెరానోస్‌ మాజీ సీఈవో హోమ్స్‌ దోషిగా నిర్ధారణ

6 Jan, 2022 01:34 IST|Sakshi

శాన్‌జోస్‌ (అమెరికా): వివాదాస్పద స్టార్టప్‌ సంస్థ థెరానోస్‌ మాజీ సీఈవో ఎలిజబెత్‌ హోమ్స్‌ను (37) మోసం, కుట్ర కేసులకు సంబంధించిన కేసుల్లో దోషిగా అమెరికా కోర్టు నిర్ధారించింది. కొన్ని రక్తపు చుక్కల పరీక్షతో వ్యాధులను గుర్తించే వైద్యపరికరాన్ని కనుగొన్నామంటూ పలువురు ఇన్వెస్టర్లను నమ్మించి, మోసం చేశారని ఆమెపై మొత్తం 11 అభియోగాలు నమోదయ్యాయి. వీటిల్లో నాలుగు ఆరోపణల్లో ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది.

మరో నాలుగు అభియోగాలను కొట్టివేసింది. మిగతా మూడు ఆరోపణలపై జ్యూరీ ఇంకా తేల్చాల్సి ఉంది. దోషిగా నిర్ధారణ అయిన కేసుల్లో శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఒక్కో కేసులో ఆమెకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని లీగల్‌ నిపుణులు భావిస్తున్నారు. ఆమెతో పాటు మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న థెరానోస్‌ మాజీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రమేష్‌ బల్వానీపై విచారణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఆ కేసు విచారణ పూర్తయ్యే దాకా హోమ్స్‌ శిక్ష ఖరారు విషయంలో న్యాయమూర్తి వేచి చూసే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

సంచలన స్టార్టప్‌లకు ఈ ఉదంతం ఒక గుణపాఠంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. వివరాల్లోకి వెడితే, హోమ్స్‌ తన 19వ యేట 2003లో థెరానోస్‌ను నెలకొల్పారు. కొద్ది చుక్కల రక్తంతో చౌకగా బ్లడ్‌ టెస్ట్‌ నిర్వహించుకునే సెల్ఫ్‌ సర్వీస్‌ మెషీన్లను రూపొందించినట్లు కొన్నాళ్లకు ప్రకటించారు. దీంతో సంస్థలో పలువురు బడా ఇన్వెస్టర్లు, ప్రముఖులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో హోమ్స్‌ బిలియనీర్‌ అయిపోయారు. థెరానోస్‌ టెక్నాలజీ, ఉత్పత్తులు లోపభూయిష్టమైనవంటూ 2015లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు