యాపిల్‌ సీఈవోగా మస్క్‌!!.. బూతులు తిట్టేసిన టిమ్‌ కుక్‌, నాన్‌సెన్స్‌..

3 Aug, 2021 11:20 IST|Sakshi

వ్యాపార లావాదేవీలు, వ్యవహార శైలితోనే కాదు వివాదాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌.  అయితే మరో దిగ్గజ కంపెనీ సీఈవో చేతిలో మస్క్‌ ఘోర అవమానం పాలయ్యాడనే వార్త ఇప్పుడు సిలికాన్‌ వ్యాలీలో జోరుగా షికార్లు  కొడుతోంది. ఇంతకీ మస్క్‌ను బండ బూతులు తిట్టింది ఎవరో కాదట. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌. అది ఎందుకు జరిగిందంటే..  

కాలిఫోర్నియా: చాలా కాలం క్రితం టెస్లాను విలీన ప్రతిపాదన యాపిల్‌ వద్దకు వచ్చింది. అయితే ఆ డీల్‌ అనుకున్న విధంగా నడవలేదు. కారణం.. ఆ డీల్‌ ఓకే కావాలంటే తనను యాపిల్‌కు సీఈవోగా ప్రకటించాలని మస్క్‌ కోరాడట. అంతే ఆ మాటతో ఉగ్రుడైన కుక్‌ .. మస్క్‌ను బండబూతులు తిట్టాడని, ‘F’ పదం చాలాసార్లు వాడాడని, కోపంగా ఫోన్‌ పెట్టిపడేశాడని సమాచారం. ఈ మేరకు ‘ది వాల్‌ స్స్ర్టీట్‌ జర్నల్‌’ రైటర్‌ టిమ్‌ హగ్గిన్స్‌ రాసిన ‘పవర్‌ ప్లే: టెస్లా, ఎలన్‌ మస్క్‌, అండ్‌ ది బెట్‌ ఆఫ్‌ ది సెంచూరీ’ అనే బుక్‌లో వాళ్లిద్దరి మధ్య సంభాషణలకు సంబంధించిన విషయాల్ని ప్రస్తావించాడు.

అయితే హగ్గిన్స్‌ రాతలను ఎలన్‌ మస్క్, టిమ్‌ కుక్‌లు ఖండించారు. తాను కుక్‌ అసలు ఎప్పుడూ మాట్లాడుకోలేదని, ఎలాంటి ప్రత్యుత్తరాలు జరపలేదని క్లారిటీ ఇచ్చాడు ఎలన్‌ మస్క్‌. అయితే ఒకానొక  దశలో టెస్లాను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశానని, కానీ, కలవడానికే ఆయన నిరాకరించాడని మస్క్‌ గుర్తు చేసుకున్నాడు. ఇక కుక్‌ కూడా మస్క్‌ లాగే స్పందించాడు. ‘ఎలన్‌తో మాట్లాడాలని నేనేప్పుడు అనుకోలేదు. కానీ, అతను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను’ అని వ్యాఖ్యానించాడు. 

‘ఆ టైంకి టెస్లా విలువ.. ఇప్పుడున్న విలువలో 6 శాతం మాత్రమే ఉంది. బహుశా అందుకే ఆయనకి(కుక్‌) ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. నాన్‌ సెన్స్‌.. ఇలాంటి వాళ్ల రాతలు పనికి మాలినవి అంటూ హిగ్గిన్స్‌పై మండిపడ్డాడు ఎలన్‌ మస్క్‌. ఇదిలా ఉంటే మోడల్‌ ఎక్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయిన తర్వాత టెస్లా ఘోరమైన ఆర్థిక నష్టాల్ని చవిచూసింది. దీంతో 2016లో 60 బిలియన్‌ డాలర్ల ఒప్పందంతో యాపిల్‌కు టెస్లాను అమ్మే ప్రయత్నం చేశాడు మస్క్‌. అయితే ఆ డీల్‌ టైంలో ఇద్దరి మధ్య ‘ఘర్షణ వాతావరణంలోనే’ ఏదో జరిగిందనే వార్తని ఆనాడు ప్రముఖ మీడియా హౌజ్‌లు అన్నీ ప్రకటించాయి. అయితే ఆనాడు జరిగింది ఇదేనంటూ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ హగ్గిన్స్‌ ఆ ఫోన్‌ సంభాషణను బయటపెట్టడం ఇప్పుడు కార్పొరేట్‌ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు